విజయవాడలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పై దాడి ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ కు విజయవాడ పర్యటనలో తగినంత భద్రత కల్పించామని, ఏపీఎస్పీ నుంచి నాలుగు ప్లాటూన్ల బలగాలను సీఎం భద్రతకు కేటాయించామని తెలిపారు. అంతేకాకుండా ఆక్టోపస్, సీఎం సెక్యూరిటీ వింగ్ కూడా ఉందని అన్నారు. సీఎం వంటి వ్యక్తి రోడ్ షోలో వాహనం పైకి ఎక్కి రూఫ్ టాప్ షో నిర్వహిస్తున్నప్పుడు వైర్లు తగలకుండా ఎక్కడైనా సరే కరెంటు ఆఫ్ చేస్తారని వివరణ ఇచ్చారు. కొన్నిచోట్ల గాలి, వర్షం కారణంగా కరెంటు తీసేశారని.. భద్రత కారణాల వల్లే విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగిందని అన్నారు. సెక్యూరిటీ ప్రొటోకాల్ లో ఇదొక భాగం అని స్పష్టం చేశారు.
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని వివేకానంద స్కూల్, గంగానమ్మ టెంపుల్ సమీపంలోకి సీఎం బస్సు వచ్చినప్పుడు ఒక వ్యక్తి రాయి విసరడం జరిగిందన్నారు. గత రెండ్రోజులుగా అక్కడ అందుబాటులో ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజి చూశామని తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఒక వ్యక్తి బలంగా రాయి విసిరినట్టు గుర్తించామని అన్నారు. ఆ రాయి సీఎం జగన్ నుదుటిపై ఎడమ వైపున తగిలి, పక్కనే ఉన్న వెల్లంపల్లి గారి ముక్కుకు, కంటికి తగిలి కిందపడింది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజి చాలా స్పష్టంగా ఉందన్నారు. మరింత స్పష్టత కోసం ఆ వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని అన్నారు. వెల్లంపల్లి ఫిర్యాదును స్వీకరించి ఐపీసీ 307 కింద కేసు నమోదు చేశామన్నారు.