పార్టీ మార్పు వార్తలపై స్పందించిన కేశినేని నాని

విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని పార్టీ మారుతున్నారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతూ ఉంది.

By Medi Samrat  Published on  8 Sept 2023 4:15 PM IST
పార్టీ మార్పు వార్తలపై స్పందించిన కేశినేని నాని

విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని పార్టీ మారుతున్నారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతూ ఉంది. ఈ వార్తలపై ఆయన స్పందించారు. తాను పార్టీ మారుతానని జరుగుతోన్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ తాను తెలుగుదేశం పార్టీ నుండే ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచి తాను మూడోసారి లోక్ సభకు వెళ్తానని అన్నారు.

రాజకీయాల్లో ప్రజాసేవ ముఖ్యమని, అప్పుడు పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. పార్టీల మధ్య పొత్తుల గురించి అధిష్ఠానం చూసుకుంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రూ.118 కోట్ల అవకతవకల గురించి ఐటీ నోటీసులు రావడంపై స్పందిస్తూ.. దేశంలో నిజాయతీ కలిగిన అతికొద్దిమంది నేతల్లో తమ పార్టీ అధినేత చంద్రబాబు ఒకరని అన్నారు. ఆయన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చ లేదన్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం సాధారణ విషయమని అన్నారు. ఆ నోటీసులకు చంద్రబాబు నాయుడే సమాధానం ఇస్తారన్నారు.

Next Story