కరోనా కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి రియల్‌ హీరోగా మారారు నటుడు సోనూసూద్‌. లక్షలాది మందికి సాయం అందించి వారి పాలిట దేవుడిగా నిలిచారు. తాజాగా సోనూసూద్‌ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం విజయవాడకు చేరుకున్నారు. అనంతరం నేరుగా ఇంద్రకిలాద్రికి వెళ్లి కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ తరువాత ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా సోనూ సూద్‌ మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా వల్ల ఎంతో మంది అనేక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని, అందరిని చల్లగా కాపాడాలని ఆ అమ్మవారిని కోరుకున్నానని సోనూసూద్ తెలిపారు. సోనూ సూద్ ను చూసేందుకు ప్రజలు గుంపులుగా తరలివచ్చారు.

సోనూ సూద్ ప్రతి రోజూ ఏదో ఒక విధంగా.. ఎవరికో ఒకరికి సహాయ పడుతూనే వస్తున్నారు. తాజాగా మ‌రో ప్రాణాన్ని నిల‌బెట్టారు సోనుసూద్. ఓ చిన్నారికి కాలేయ మార్పిడి, గుండె శ‌స్త్ర చికిత్స చేయించారు. బాలుడి కుటుంబ స‌భ్యులు సోనుసూద్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. 'మీ మ‌ద్ద‌తు వ‌ల‌న.. శుభ‌మ్ కాలేయ మార్పిడి, గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి అయ్యింది. హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. మీ సహాయానికి ధన్యవాదాలు' అంటూ బాలుడి కుటుంబ స‌భ్యులు ట్వీట్ చేయ‌గా.. సోనూ సూద్ 'బిగ్ డే.. ఈ మ‌ధ్య కాలంలో చాలా క్లిష్ట‌మైన కాలేయ మార్పిడి, గుండె శస్త్రచికిత్స ఒకటి సూపర్ సక్సెస్. సర్వశక్తిమంతుడికి ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశారు.


M. Sabarish

నేను శ‌బ‌రీష్‌, న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో భార‌త్ టుడే, న్యూసు, పబ్లిక్ టీవీ తెలుగు త‌దిత‌ర వార్త సంస్థ‌ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Next Story