ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ రాష్ట్రంలో వినిపిస్తోన్న డిమాండ్ల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలను టీడీపీ ఆదేశించింది. ఎవరూ కూడా మీడియా సమావేశాల్లో బహిరంగ స్టేట్‌మెంట్లు చేయవద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు చర్చించి మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది. పర్సనల్ ఒపీనియన్స్‌ను పార్టీకి ఆపాదించవద్దని స్పష్టం చేసింది.
ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు మైదుకూరు టూర్‌లో ఉన్న సమయంలో కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నారా లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తన ఒపీనియన్‌ను చెప్పారు. ఆ తర్వాత పలువురు నేతలూ ఇదే అంశంపై వరుసగా మాట్లాడడం ప్రారంభించారు. పార్టీతో సంబంధం లేకపోయినా.. ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ వారు చెబుతూ వస్తున్నారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ఇ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ శాసనసభ్యుడు ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే బహిరంగంగానే మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారు చెప్పడం సరికాదని, పార్టీ అధిష్ఠానం భావించింది. ఇలాంటి సున్నితమైన అంశాలపై కూటమి నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది.