పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. 'పంతానికి దిగితే నా సినిమాలను ఏపీలో ఉచితంగా ఆడిస్తా'
Pawan Kalyan comments about his cinimas in AP.తన చిత్రాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న
By తోట వంశీ కుమార్ Published on 12 Dec 2021 1:31 PM GMTతన చిత్రాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేపట్టిన సంఘీభావ దీక్ష ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2024లో కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావడం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. 2014లో ఓట్లు చీల్చకూడదనే తాను పోటీ చేయలేదన్నారు. ఇక 2024 ఎన్నికలు వచ్చేంత వరకు భరించక తప్పదన్నారు. మా ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటే వాళ్ల తరఫున నిలబడతాం. లేదంటే ఆ తర్వాత జరిగే వాటికి తాను ఏమి చేయలేనన్నారు.
ఇక తన సినిమాలను ఆపేసి ఆర్థికంగా దెబ్బకొట్టాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందన్నారు. తన సినిమాలను ఆపేస్తే భయపడేంత పిరికివాడిని కాదని పవన్ తెలిపారు. పంతానికి దిగితే.. ఏపీలో తన సినిమాలను ఉచితంగా ఆడిస్తానని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టిక్కెట్లల్లో పారదర్శకత లేదని అంటున్నారు.. మరి ప్రభుత్వం చేసే మద్యం వ్యాపారంలో పారదర్శకత ఉందా అని ప్రశ్నించారు. రూ.700తో మద్యం తాగి రూ. 5 తో సినిమా టిక్కెట్ కొనుక్కుని వెళ్తే ప్రభుత్వానికి సంతోషంగా ఉంటుందని పవన్ ఎద్దేవా చేశారు.
నా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు నా సినిమాలు ఆపేస్తే, భయపడుతా అనుకుంటున్నారు. నేను భయపడే వ్యక్తిని కాదు, అవసరమైతే AP లో ఫ్రీ గా షోలు వేస్తాను - JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/6pqmWOmSbP
— JanaSena Party (@JanaSenaParty) December 12, 2021
వైసీపీ నేతలు అధికారంలో ఉండి స్టీల్‌ప్లాంట్‌తో సంబంధం లేదంటే ఎలా అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని వైసీపీ ఎందుకు ప్రచారం చేసిందని పవన్ నిలదీశారు. ప్రైవేటీకరణను ఆపుతామనే అజెండాతో కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓట్లు ఎందుకు వేయించుకున్నారని ఆయన మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ తప్పులకు తగిన సమాధానం చెబుతామన్నారు. సిగరెట్లు తాగితే ప్రజల హానీకరం అన్నట్లుగా.. ఏపీలో ప్రజల ఆరోగ్యానికి వైసీపీ హానికరం అని పవన్ అన్నారు.