మన సీఎం టీమ్‌గా.. ప్రజల కోసం పనిచేద్దాం : మంత్రి పయ్యావుల కేశవ్
రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేద్దాం అని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్ అన్నారు.
By Kalasani Durgapraveen Published on 11 Dec 2024 3:30 PM ISTరాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేద్దాం అని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్ అన్నారు. సీఎం చంద్రబాబు సూచనలు, సలహాలకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేద్దాం అన్నారు. 1994 నుండి అంటే దాదాపు 30 ఏళ్ల నుండి సీఎం చంద్రబాబుతో ప్రయాణం చేస్తున్నాం అని తెలిపారు. చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు ఎంత తపనతో పని చేశారో ఇప్పుడు కూడా అదే కమిట్‌మెంట్‌తో ముందుకెళ్తున్నారన్నారు. మిగిలిన జీవితం ప్రజల కోసమే, ప్రతి పనిలోనూ మానవత్వం ఉండాలనే విధంగా అదే తపనతో పరిపాలన అందిస్తున్నారన్నారు. చంద్రబాబు పనితీరు అందరికీ మార్గదర్శకం అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వారసత్వంగా వచ్చిన ప్రధాన సమస్య రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో 99 శాతం రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే సరిపోయిన పరిస్థితి.. అంతకుముందు రెండేళ్లు 107 శాతం రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే వెచ్చించిన పరిస్థితి ఉందన్నారు. ఒక లక్షా 14 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. తాజాగా రెండు జిల్లాల్లో రివ్యూ చేపట్టడం జరిగింది.. వాస్తవ పరిస్థితులు చూస్తే చాలా బాదనిపిస్తోందన్నారు. రూ.3 కోట్లు ఖర్చు పెడితే సరిపోయేది కానీ అలా కూడా చేయలేదు..దీంతో కేసీ కెనాల్ గత ఐదేళ్లలో నాశనం అయిందన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు అప్పులు, ఆగిపోయిన ప్రాజెక్టులు, మరోవైపు ప్రజల ఆశలు, ఆకాంక్షలు.. మరో వ్యక్తి అయితే నిద్రపోలేని పరిస్థితి.. కానీ సీఎం చంద్రబాబు ప్రజాక్షేమమే ధ్యేయంగా కష్టపడుతున్నారన్నారు. మనమంతా ఆయన అడుగుజాడల్లో పని చేద్దాం అన్నారు.
10 యూనివర్సిటీల్లో నేర్చుకోలేనిది ఒక చంద్రబాబు వద్ద నేర్చుకోవచ్చు అన్నారు. ప్రతి రూపాయి ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలన్నారు. మన సీఎం టీమ్ గా.. ప్రజల కోసం పనిచేద్దాం.. రాష్ట్ర ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చే పరిస్థితుల్లో మీరున్నారు.. దీన్ని సద్వినియోగం చేసుకుందాం అన్నారు.