ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈనెల 10 నుండి 13వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ -2025 పోటీలు జరగనున్నాయి. విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) కార్యాలయం నేతృత్వంలో తొలిసారి సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించబడుతోంది. ఈ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ లో దక్షిణాది నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న జట్లు పాల్గొని తలపడనున్నాయి.
తొలిసారిగా ఈ క్రీడలను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తోండటం గర్వించదగ్గ విషయం. ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ కు అర్హత పొందేందుకు ఈ టోర్నమెంట్ ఉపయోగపడనుందని ఆడిట్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. టోర్నమెంట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులు జాతీయస్థాయిలో వారి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని పొందుతారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవం 10 ఫిబ్రవరి, 2025న ఉదయం 8 గం.లకు జరుగుతుంది. 13 ఫిబ్రవరి, 2025న మధ్యాహ్నం 1.30 గం.లకు ముగింపు వేడుకతో టోర్నమెంట్ ముగుస్తుంది..క్రీడాభిమానం ఉన్న ప్రతిఒక్కరూ సంబంధిత మ్యాచ్ లు వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.