ఏపీలో 5 వేలకు పైగా డ్రోన్లతో మెగా షో.. ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 కు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
By Kalasani Durgapraveen Published on 21 Oct 2024 4:46 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 కు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పున్నిమీ ఘాట్ వద్ద 22వ తేదీ సాయంత్రం 5 వేలకు పైగా డ్రోన్లతో మెగా షో నిర్వహిస్తున్నారు. ఈ డ్రోన్ షోని ప్రజలందరూ విస్తృతంగా తిలకించడానికి వీలుగా విజయవాడ నగరంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. నగరంలో ఐదు ప్రాంతాల్లో భారీ డిజిటల్ తెరలు ఏర్పాటు చేసి ప్రజలు ఈ షోని తిలకించి ఆస్వాదించేలా ఏర్పాట్లు చేశామని డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్ చెప్పారు. విజయవాడ నగరంలో బెంజిసర్కిల్, రామవరప్పాడు రింగు, వారధి, బస్టాండు, ప్రకాశం బ్యారేజీల వద్ద ఈ డిజిటల్ తెరలు ఏర్పాటు చేసి ఈ డ్రోన్ షోని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చెప్పారు. ప్రజలందరూ ఈ షోని తిలకించాలని, పున్నమీ ఘాట్‌లో కూడా ప్రజలు ఈ షోని ప్రత్యక్షంగా తిలకించవ్చని తెలిపారు.
ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం
22-23వ తేదీల్లో నిర్వహించే అమరావతి డ్రోన్ సమ్మిట్ విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం రేయింబవళ్లు కృషి చేస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర పెట్టుబుడులు, మౌలికసదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, ఏపీ డ్రోన్ కార్పొరేష్ ఎండీ కె. దినేష్ కుమార్‌లు ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో 22వ తేదీ ఉదయం అమరావతి డ్రోన్ సమ్మిట్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ఈ సదస్సుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహననాయుడు, ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డిలు కూడా పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం పున్నమీ ఘాట్‌లో పెద్ద ఎత్తున డ్రోన్ షో, క్రాకర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏర్పాట్లను చేయడంలో అధికార యంత్రంగా తలమునకలైంది. 10 మంది డిప్యూటీ కలెక్టర్లకు ఈ ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పారు. దాదాపు 300 మంది అధికారులు, సిబ్బంది రేయింబవల్లు శ్రమించి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలందరూ ఈ డ్రోన్ షోను తిలకించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలిన ఏపీ డ్రోరన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్ కోరారు.