ఛార్జర్ వైర్ తో రాహుల్ ని హత్య చేశారు : సీపీ శ్రీనివాసులు

CP Srinivasulu About Rahul Murder. యువ వ్యాపార‌వేత్త‌ రాహుల్ హత్య ఈనెల 18న సాయంత్రం జరిగిందని విజ‌య‌వాడ

By Medi Samrat  Published on  27 Aug 2021 1:09 PM GMT
ఛార్జర్ వైర్ తో రాహుల్ ని హత్య చేశారు : సీపీ శ్రీనివాసులు

యువ వ్యాపార‌వేత్త‌ రాహుల్ హత్య ఈనెల 18న సాయంత్రం జరిగిందని విజ‌య‌వాడ సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. రాహుల్ మృతిపై 19న పోలీసులకు ఫిర్యాదు అందిందని.. కారులో డెడ్ బాడీ ఉందని తెలిసి ఘటనా స్థలానికి వెళ్లి డెడ్ బాడీని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించామ‌ని.. విచారణలో యువ పారిశ్రామికవేత్త రాహుల్ డెడ్ బాడీ అని తెలిసిందని శ్రీనివాసులు పేర్కొన్నారు. కాల్ డేటా ఆధారంగా కేసును దర్యాప్తు చేసామ‌ని.. అనేక కోణాల్లో విచారణ జ‌రిపామ‌ని.. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా హత్య జరిగిందని తెలింద‌ని వివ‌రించారు.

విచారణలో వ్యాపార లావాదేవీల కారణంగా హత్య జరిగిందని నిర్ధారణకు వచ్చామ‌ని తెలిపారు. కోరాడ విజయ్ కుమార్ కు రాహుల్ కు మధ్య గొడవ జరిగిందని.. కోగంటి సత్యం ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని సీపీ పేర్కొన్నారు. గాయత్రి కూతురుకు డిల్లీలో మెడికల్ కాలేజ్ సీటు కోసం రాహుల్ ఆరు కోట్ల రూపాయలు తీసుకున్నాడని.. సీటు ఇప్పించకపోవడంతో గాయత్రి రాహుల్ పై కక్ష పెంచుకుందని.. సీటు విషయంలో గాయత్రికి రూ. 50 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడని.. సీతారాంపురంలోని కోరాడ విజయ్ కుమార్ చిట్స్ కార్యాలయానికి డబ్బులు ఇచ్చేందుకు వెళ్ళాడని.. ఆ సమయంలో ఘర్షణ జరిగిందని తెలిపారు.

ఆ తరువాత రాహుల్ ని కోగంటి సత్యంకు చెందిన దుర్గా కళామందిరంలోని ఆఫీసుకు తీసుకు వెళ్లారని.. అనంత‌రం ఛార్జర్ వైర్ తో రాహుల్ ని హత్య చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో ఏడుగురు ని అరెస్ట్ చేసామ‌ని తెలిపారు. 23వ తేదీన కోగంటి సత్యంని అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరిచామ‌ని.. మొత్తం కేసులో 13 మంది ఉన్నారని.. వారిలో ఏడుగురిని అరెస్ట్ చేసామ‌ని తెలిపారు. రాహుల్ కి చెందిన ఒక ఫోన్ ని అల్లూరి సీతారామరాజు వంతెనపై నుంచి కాలువలో పడేశార‌ని వెల్ల‌డించారు.


Next Story
Share it