ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాళ్లు.. అమరావతిలో 144 సెక్షన్
విజయవాడ : అక్రమాస్తుల ఆరోపణలను రుజువు చేసేందుకు పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అధికార
By అంజి
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాళ్లు.. అమరావతిలో 144 సెక్షన్
విజయవాడ : అక్రమాస్తుల ఆరోపణలను రుజువు చేసేందుకు పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ప్రతిపక్ష తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో పల్నాడు జిల్లా అమరావతిలో శనివారం రాత్రి 9 గంటల నుంచి 144 సెక్షన్ విధించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు.
అమరావతి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఎమ్మెల్యే శంకరరావు ఆదేశాల మేరకు కృష్ణానది నుంచి భారీ ఎత్తున ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారని కొమ్మాలపాటి శ్రీధర్, అతని మద్దతుదారులు ఆరోపించారు. దీనిపై ఆదివారం ఉదయం అమరావతిలోని ఆలయంలో చర్చకు రావాలని శంకరరావుకు శ్రీధర్ సవాల్ విసిరారు. దీనికి కౌంటర్‌గా శంకరరావు తన ఆరోపణలను నిరూపించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌కు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ నేతలు, మద్దతుదారులతో అమరావతి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అమరావతి పట్టణంలో 144 సెక్షన్ విధించినట్లు డీఎస్పీ ఆదినారాయణ ప్రకటించడంతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఎలాంటి చర్చలకు హాజరుకావద్దని సూచించారు. ఎవరైనా శాంతిభద్రతల పరిరక్షణకు విఘాతం కలిగించి, పౌర జీవనానికి భంగం కలిగించాలని భావిస్తే, వారితో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే అమరావతిలోని లాడ్జీల్లో కొత్త వ్యక్తులకు గదులు ఇవ్వొద్దని నిర్వహకులకు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు అమరావతికి వెళ్లకుండా టీడీపీ ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. నోటీసులు ఇచ్చి, ఇంటి నుంచి బయటకు రావొద్దని అడ్డుకుంటున్నారు.