అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా నున్న పెట్రోలు బంకుల ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చమురు పరిశ్రమల ప్రతినిధులను కోరారు. బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలోని తమ ఛాంబరులో హెపిసిఎల్, ఐఓసిఎల్, బిపిసిఎల్ చమురు పరిశ్రమల ప్రతినిధులతో ఆయన సమావేశమై ఓటర్ల అవగాహనా కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. క్రమబద్దమైన ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్యం (SVEEP - Systematic Voters' Education and Electoral Participation) కార్యక్రమం అమల్లో భాగంగా ఓటర్ల అవగాహనా కార్యక్రమాలను చమురు పరిశ్రమల ద్వారా కూడా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే పోస్టల్ శాఖ ద్వారా ఓటర్ల అవగాహనా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల ద్వారా ఓటర్ల అవగాహనా ప్రచారాన్ని నిర్వహించాలని కోరారు. ఈసీఐ లోగోతో ఎన్నికల తేదీ, ఓటు హక్కు విలువను తెలిజేసే నినాదాలతో హోర్డింగుల డిజైన్లను అందజేస్తామన్నారు. వాటిని వినియోగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల వద్ద హోర్డింగులను ఏర్పాటు చేసి తద్వారా ఓటర్ల అవగాహనా ప్రచారాన్ని నిర్వహించాలని ఆయన కోరారు. సీఈవో ముఖేష్ కుమార్ మీనా ప్రతిపాదనలకు చమురు కంపెనీల ప్రతినిధులు అంతా సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే తగు చర్యలు తీసుకుంటామని హోమీ ఇచ్చారు.