మళ్లీ తెరపైకి 'రాములమ్మ' రాజకీయం.. అడుగులు ఎటువైపు..?
By సుభాష్ Published on 28 Oct 2020 11:51 AM ISTతెలంగాణ రాములమ్మ ఎవరంటే అందరు టక్కున చెప్పే పేరు విజయశాంతి. కాంగ్రెస్ నుంచి మరో పార్టీలోకి వెళ్లేందుకు కూడా క్లాప్ కొట్టబోతున్నారన్న ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వెడెక్కిస్తోంది. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ లేడి డాన్ గా వ్యవహరించి అందరి మన్ననలు పొందిన రాజకీయా నాయకురాలు విజయశాంతి అని బల్లగుద్దినట్లు చెప్పుకోవాలి.
కాషాయం వీడేందుకు రంగం సిద్దం
విజయశాంతి గురించి రాజకీయాల్లో ఆసక్తికర అంశాలు జోరుగా కొనసాగుతున్నాయి. రాములమ్మ కాంగ్రెస్‌ను వీడి కాషాయంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సోమవారం విజయశాంతితో భేటీ అయినట్లు తెలుస్తోంది. దాదాపు గంటపాటు ఇరువురూ చర్చలు జరిపారు. పార్టీ ప్రచార కమిటీకి సారథ్యం వహిస్తున్న ఆమె తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవడం, చాలా రోజుల నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో కిషన్‌రెడ్డితో భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పాలి. పాత గూటికి రావాలని, బీజేపీలోకి వస్తే తగిన ప్రాధాన్యత కల్పిస్తామని విజయశాంతిని కిషన్‌రెడ్డి ఆహ్వానించారని సమాచారం. అయితే తనకు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఉన్నా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని రాములమ్మ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
నిజానికి విజయశాంతి గత కొన్ని రోజుల నుంచి సైలెంట్‌గా ఉంటున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అధిష్టానం అప్పగించినా రాష్ట్ర నాయకత్వం సహకరించడం లేదనే కారణంగా ఆమె అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపత్యంలో ఆమె కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుకుగా పాలు పంచుకోవడం లేదు. పార్టీ సమావేశాలకు సైతం హాజరు కావడం లేదు. ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ తొలిసారి రాష్ట్రానికి వచ్చిన సమయంలో జరిగిన సమావేశాలకు రాములమ్మను ఆహ్వానించినా హాజరు కాలేదు. ఇక దుబ్బాక ఎన్నికల వ్యవహారంలో ఆమె పార్టీ కానీ, పార్టీని ఆమె పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులకు, విజయశాంతికి మధ్య రాజకీయ దూరం పెరిగింది.
రాములమ్మ కాంగ్రెస్‌లో అంశాంతితో రగిలిపోతుందా…?
కాంగ్రెస్ లో అశాంతితో రగిలిపోతున్న విజయశాంతి, కాషాయతీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతోన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలాడుతున్నాయి. కాంగ్రెస్ లో మహిళలకు విలువలు లేవనే నిరాశతో కమలం గూటికి వెళ్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఏకంగా ఢిల్లీ పెద్దల నుంచి ఆహ్వానాలు కూడా వచ్చినట్లు సమాచారం. బీజేపీలోకి వెళ్లేది లేదని గతంలోనే శపథం చేసిన రాములమ్మ, ఒట్టు తీసి గట్టున పెట్టి, పువ్వు పరిమళాన్ని ఆస్వాదించేందుకు సిద్దమవుతున్నారన్న వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బీజేపీలో వెళ్తారని గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చినా.. ఏమి జరగలేదు. కానీ మళ్లీ రాములమ్మ రాజకీయం తెరపైకి వచ్చింది.
సొంత గూటికి తీసుకువచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందా..?
అయితే, హస్తం పార్టీలో అసంతృప్తిగా ఉన్న రాములమ్మను, కాషాయ కండువా కప్పి, సొంతపార్టీ గూటికి తీసుకురావడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లో మెజార్టీ సీనియర్లంతా బీజేపీ వైపు చూస్తుండటంతో, సినిమా గ్లామర్ తో పాటు రాజకీయ ఇమేజ్ ఉన్న రాములమ్మను స్వగృహ ప్రవేశం చేయించాలని బీజేపిలో అగ్రనాయకత్వం సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ సీనియర్లంతా తనను టార్గెట్ చేస్తూ పార్టీలో పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో, రాములమ్మ సైతం పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. దీంతో ఆమె కాషాయ దారిలో వెళ్తారా ..? లేదా అన్నది చెప్పలేమంటున్నారు విజయశాంతి సన్నిహితులు. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను రాములమ్మ నిజం చేస్తారన్న మాట కూడా బలంగానే వినిపిస్తోంది. తెలంగాణలో కమలం వికసించే అవకాశాలు మెండుగా ఉండటంతో ఆమె అటువైపు వెళ్లే అవకాశాలున్నాయనే మాట కూడా రాజకీయ నాయకుల చెవిలో చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ తనకు తగిన ప్రాధాన్యత లేకపోవడంతో రాములమ్మ కాస్త కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీలోకి వెళ్లేందుకు దారులు తెరుచుకునే ఉన్నాయనే మాట వినిపిస్తోంది. మొత్తం మీద మరి విజయశాంతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.