యస్‌ బ్యాంకును అడ్డుపెట్టుకొని బాబు కోట్లు సంపాదించాడు.!

By అంజి  Published on  7 March 2020 7:50 AM GMT
యస్‌ బ్యాంకును అడ్డుపెట్టుకొని బాబు కోట్లు సంపాదించాడు.!

ముఖ్యాంశాలు

  • తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
  • చర్చనీయాంశంగా మారిన విజయసాయి వ్యాఖ్యలు

యస్‌ బ్యాంక్‌ను అడ్డుపెట్టుకొని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కమీషన్ల రూపంలో కోట్లు సంపాదించాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌ సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో విజయసాయి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రూ.1,300 కోట్ల టీటీడీ నిధులను చంద్రబాబు నాయుడు యస్‌ బ్యాంక్‌లో డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. యస్‌ బ్యాంక్‌కు ఏపీ టూరిజం శాఖ నిధులను కూడా దోచిపెట్టాడని, ఇంకెన్ని ఉన్నాయో? అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఇందుకు ఆధారంగా ఆయన యస్‌ బ్యాంకుకు సంబంధించిన ఓ స్క్రీన్‌ షాట్‌ను కూడా పోస్ట్ చేశారు.

భారతదేశపు అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో అయిదో స్థానంలో ఉన్న యస్ బ్యాంక్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గత మూడు రోజుల క్రితం మారటోరియం విధించింది. దీంతో వినియోగదారులు రూ. 50,000 మొత్తానికి మించి నగదు విత్‌డ్రా చేయకుండా పరిమితి విధించింది. దీంతో యస్‌ బ్యాంక్‌ కస్టమర్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి స్పష్టం చేసినా వినియగదారులు ఆందోళనలోనే ఉన్నారు.

ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ హయాంలో టీటీడీ నిధులను నాలుగు ప్రైవేట్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన సంగతి తెలిసింది. యస్‌ బ్యాంక్‌లో రూ.1,300కోట్లును డిపాజిట్‌ చేశారు. దీంతో వైసీపీ అధికారంలోకి రావటం, టీటీడీ చైర్మన్‌గా వైబీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత.. బోర్డు వివిధ బ్యాంకుల్లో చేసిన శ్రీవారి డిపాజిట్లపై దృష్టిసారించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు ఎక్కడ డిపాజిట్‌ చేశారో సమీక్షించింది. యస్‌ బ్యాంకులో రూ.1,300కోట్లు డిపాజిట్లు చేసి ఉండటంతో సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన టీటీడీ బోర్డు తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించి డిపాజిట్‌ చేసిన రూ.1,300 కోట్లను అక్టోబర్‌ నెలలోనే విత్‌ డ్రా చేసింది. ఇదిలా ఉంటే తాజాగా విజయసాయిరెడ్డి ఏపీ టూరిజం శాఖ నిధులు కూడా చంద్రబాబు యస్‌ బ్యాంకుకు దోచిపెట్టారంటూ ట్విటర్‌లో కామెంట్‌ చేయడంతో ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు హయాంలో ఇంకెంత సొమ్మును యస్‌ బ్యాంకులో డిపాజిట్‌ చేసి కమీషన్లు తీసుకున్నారో అంటూ వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.Next Story
Share it