అవును.. నేను పుష్ప నుండి తప్పుకున్నాను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2020 2:04 AM GMT
అవును.. నేను పుష్ప నుండి తప్పుకున్నాను

టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లలో 'పుష్ప' సినిమా కూడా ఒకటి. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందుకే అన్ని భాషాల్లోనూ స్టార్ స్టేటస్ ఉన్న నటులను తీసుకోవాలని భావించారు. తమిళ నటుడు విజయ్ సేతుపతిని ఈ సినిమా కోసం తీసుకున్నారు. అల్లు అర్జున్-విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ రచ్చహ రచ్చస్య రచ్చోభ్యహ అనుకున్నారు అభిమానులు.

ఇప్పుడు అభిమానుల ఆశలపై నీళ్లు జల్లాడు విజయ్ సేతుపతి. 'పుష్ప' సినిమా చేయడం లేదని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు. ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ విజయ్ సేతుపతి ఈ విషయాన్ని వెల్లడించాడు. కాల్షీట్ల సమస్య వల్లే సినిమా నుంచి తాను తప్పుకున్నానని.. సుకుమార్ ని వ్యక్తిగతంగా కలిసి తన కాల్షీట్ల సమస్య గురించి చెప్పానని అన్నాడు విజయ్ సేతుపతి. డేట్ల సమస్య కారణంగా సినిమా షూటింగ్ కు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతోనే సినిమా నుంచి తప్పుకున్నానని క్లారిటీ ఇచ్చాడు. పుష్ప సినిమా షూటింగ్ కేరళలోని అడవుల్లో జరగాల్సి ఉండగా.. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడిపోయింది.

విజయ్ సేతుపతి నటిస్తున్న మరో పెద్ద ప్రాజెక్ట్ 'మాస్టర్'. ఇళయదళపతి విజయ్, మాళవిక నాయర్ లు నటిస్తున్న ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు. ఈ సినిమాలో తాను చేసిన పాత్ర గురించి కూడా కొన్ని హింట్స్ ఇచ్చాడు విజయ్ సేతుపతి. మాస్టర్ సినిమాలో తనది ఎంతో క్రూరమైన పాత్ర అని చెప్పుకొచ్చాడు. కొంచెం కూడా మంచితనమే లేని పాత్ర అని.. ఆ పాత్రను ఎంతో ఎంజాయ్ చేశానని అన్నాడు. విజయ్ సేతుపతి పేట సినిమా నుండి నెగటివ్ పాత్రలు చేయడం మొదలుపెట్టాడు. తెలుగులో కూడా ఉప్పెన సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. మాస్టర్, ఉప్పెన సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. మరో రెండు సినిమాల్లో విజయ్ సేతుపతి నటిస్తూ ఉన్నాడు. వెబ్ సిరీస్ కూడా చేయడానికి విజయ్ సేతుపతి రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Next Story