వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న దర్శకధీరుడు

By రాణి  Published on  13 July 2020 7:36 AM GMT
వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న దర్శకధీరుడు

దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇలాంటి సమయంలో సినిమా షూటింగులు జరుపుకునేందుకు ప్రభుత్వాలు అనుమతులిచ్చినా సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలతో పాటు హీరోలు సైతం రెడీగా లేరు. లాక్ డౌన్ ముందు వరకూ షూటింగ్ లు ఎక్కడ ఆగిపోయాయో..ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. ఇక రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు విడుదల చేసేందుకే సరైన పరిస్థితి లేనప్పుడు కొత్త సినిమాలు తీసి నష్టపోవాల్సిందే తప్ప లాభపడేదేమీ లేదని అభిప్రాయపడుతున్నారు నిర్మాతలు. ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ వంటి చిత్రాలు సైతం షూటింగ్ లను తాత్కాలికంగా నిలిపివేశాయి.

థియేటర్లు తెరుచుకునేంతవరకూ వేచి ఉండి సినిమాలను విడుదల చేసినా ఎక్కువరోజులు ఆడవన్న ఉద్దేశంతో చాలా మంది ఓటీటీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5 తెలుగు వంటి ఓటీటీల్లో పలు సినిమాలు విడుదలయ్యాయి. నిజానికి థియేటర్ కన్నా ఓటీటీనే కాస్తో కూస్తో లాభాలు తెచ్చిపెడుతుందని తెలుస్తోంది. ఇప్పటికే కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్, కొత్తగా వచ్చిన భానుమతి రామకృష్ణ చిత్రాలు మంచి సక్సెస్ అందుకున్నాయి.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోవడంతో దర్శకధీరుడు రాజమౌళి వెబ్ సిరీస్ వైపు అడుగులేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే టాలెంట్ ఉన్నవారికి జక్కన్న ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైపోయిందట. వెబ్ సిరీస్ ను జక్కన్న డైరెక్ట్ చేయకపోయినా ఆయన పర్యవేక్షణలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇది ఎంత వరకూ నిజమో జక్కన్న కూడా ఒక క్లారిటీ ఇస్తే చాలు.

Next Story