నాకు చెడ్డపేరు తెచ్చేందుకు కొన్ని సైట్లు ప్రయత్నిస్తున్నాయి : విజయ్ దేవరకొండ
By తోట వంశీ కుమార్ Published on 4 May 2020 2:30 PM GMT
కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి లాక్‌డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ వల్ల పేద ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పేద ప్రజలను ఆదుకోవడానికి పలువురు విరాళాలు అందజేయగా.. మరికొందరు నేరుగా బాధితులకు సాయం చేశారు. మరికొందరు వారికి కావాల్సిన నిత్యావసరాలను పంపిణీ చేశారు.
పేదలకు సాయం చేయడానికి హీరో విజయ్ దేవరకొండ మిడిల్‌క్లాస్ ఫౌండేషన్(ఎంసీఎఫ్) ద్వారా సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఓ నాలుగు వెబ్ సైట్ల వాళ్లు తనకు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. గత కొన్ని రోజులుగా ఆయా సైట్ల వార్తల్ని గమనిస్తున్నాయని విజయ్ దేవరకొండ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేశారు.
'ఎదుటి వ్యక్తి ఏమైపోయినా ఫర్యాలేదు.. నేను బాగుండాలి అనుకేనే వారు సమాజంలో ఉన్నారు. ఇలాంటి వారు సమాజానికి ప్రమాదకరం. వీరి గురించే ఈ రోజు మాట్లాడాలని అనుకుంటున్నా.. ఓ నాలుగు వెబ్‌సైట్ల వాళ్లు ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారు. వీరి వల్ల చాలా మంది భాదపడుతున్నారు. వీళ్ల వల్ల సినీ ఇండస్ట్రీ ఇంకా ఎక్కువగా బాధపడుతోంది. మాపై తప్పుడు వార్తలు రాసి.. వాటిని అమ్మి.. సొమ్ము చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు వీళ్లన్ని చూసి చూడనట్లు వచ్చా.. ఇక ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుత సమయంలో విజయ్ ఎక్కడ..? విజయ్‌కి సాయం చేసే మనసు లేదా..? అంటూ ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారు. అసలు వీరందరూ ఎవరు నన్ను అడగటానికి. మీరంతా సినీ ఇండస్ట్రీపై ఆధార పడి బతుకుతున్నారు. యాడ్స్ ఇవ్వకుంటే.. సినిమాలకు తక్కువ రేటింగ్స్ ఇస్తామని బెదిరిస్తున్నారు. ఇక ఇంటర్వ్యూలు వారు అడిగిన సమయంలో ఇవ్వకుంటే ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. వారి అభిప్రాయాలను అందరిపై రుద్దుతున్నారు. నాకు ఎప్పుడు ఇష్టం అయితే అప్పుడు ఇస్తా.. నాకు నచ్చిన వారికి ఇస్తా.. సమయం ఉంటే ఇస్తా.. లేకుంటే లేదు.. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా..? అంటూ విజయ్ ధ్వజమెత్తారు.
25 లక్షలతో పౌండేషన్‌ను ప్రారంభించామని, 2 వేల కుటుంబాలను ఆదుకోవాలని అనుకున్నామని విజయ్ చెప్పాడు. ప్రజలు విరాళాలు అందించడంతో ఈరోజుకి రూ.70లక్షలు అయ్యింది. ఇక వివరాలను ఎప్పటి కప్పుడు వెబ్‌సైట్‌లో లైవ్ అప్ డేట్స్ ఇస్తున్నాం. అయినప్పటికి సదరు వెబ్‌సైట్లు మళ్లీ తప్పుడు వార్తలు రాస్తున్నాయి. నేను సేకరిస్తున్న విరాళాల్లో గందరగోళం జరుగుతోందని రాస్తున్నారు. ఇది పద్దతి కాదని కావాలంటే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని.. తప్పుడు సమాచారాన్ని రాయొద్దని విజయ్ అన్నారు.