వారి కోసం విజయ్ దేవరకొండ భారీ సాయం
By తోట వంశీ కుమార్ Published on 26 April 2020 11:15 AM GMT
కరోన మహమ్మారిని వ్యాప్తిని నియంత్రించడానికి దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను విధించారు. ఈ లాక్‌డౌన్‌తో పేదలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు ఇప్పటికే చాలా మంది దాతలు ముందుకు రాగా.. తాజాగా టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్‌దేవరకొండ ముందుకు వచ్చాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయాలనే లక్ష్యంతో ఓ మంచి కార్యక్రమంతో ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరో.. లాక్‌డౌన్ అనంతరం కొద్ది మందికి ఉద్యోగాల విషయంలో సాయం చేస్తానని చెప్పారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశాడు విజయ్. నేను మీ అందరికి గురించి ఆలోచిస్తుంటాను. మీ అందరు సేఫ్‌గా ఉండండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ పేరు చెప్పాలని కూడా లేదని, దాని పేరు విని విని చిరాకు వచ్చేసిందన్నారు. మనందర్నీ కట్టి, కొట్టింది. ప్రస్తుతం తన అకౌంట్లో కూడా సరిపడా డబ్బులేవని, తన కుటుంబంతో పాటు 35 మందికి జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత తన పై ఉందన్నారు. ఇలా డబ్బులు లేకపోవడం తన జీవితంలో కొత్తేంకాదని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం అనేది కొత్త అని చెప్పారు. రెండు మంచి కార్యక్రమాలతో ముందుకు వచ్చానని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి కుటుంబాలకు సాయం చేయడం, రెండో భవిష్యత్ లో ఉద్యోగాల విషయంలో కొందరికి సాయం చేయడమని అన్నాడు.
టీడీఎస్ గతంలోనే ఏర్పాటు చేశానని, ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పదలుచుకోలేదని, అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పక తప్పడం లేదన్నారు. విద్యార్థులను ఎంపిక చేసి వారికి నచ్చిన రంగాల్లో ఈ ఫౌండేషన్ తరఫున శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు పొందేలా చేస్తామన్నారు.
మద్యతరగతి కుటుంబాల కోసం రూ.25లక్షలతో ఏర్పాటు చేసిన మిడిల్‌క్లాస్ ఫౌండేషన్(ఎంసీఎఫ్) ద్వారా సాయం అందిస్తామన్నారు. ఎవరైతే నిత్యావసరాలు లేకుండా ఇబ్బందులు పడుతుంటారో వారికి ఈ ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తామని తెలిపాడు. www.thedeverakondafoundation.org వెబ్ సైట్ లో లాగిన్ అయి తమ వివరాలను తెలియజేస్తే, తమ టీమ్ కాల్ చేస్తుందని తెలిపారు. ఇంటికి దగ్గర ఉన్న కిరాణా షాపుకో, సూపర్ మార్కెట్ కు వెళ్లి సరుకులు కొనుగోలు చేస్తే తాము దుకాణపు యజమానికి డబ్బులు చెల్లిస్తామన్నాడు.