కరోనా ఆట కట్టించిన దేశం ఏదంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 March 2020 9:45 AM ISTచిన్న దేశాలు అంటే మనకు చాలా చిన్నచూపు. అభివృద్ధి ఉండదని, సమస్యలు వస్తే తట్టుకొని నిలబడలేవని, ప్రజలకు కనీస సౌకర్యాలూ కల్పించలేవని భావిస్తూ ఉంటాం. అయితే కరోనా మన ఆలోచనా ధోరణిని మార్చేలా ఉంది. ఎందుకంటే అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇరాన్.. ఇలాంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ కరోనా దెబ్బకు విలవిలలాడుతుంటే చైనా పక్కనే ఉన్న వియత్నాం మాత్రం కరోనాను విజయవంతంగా కట్టడి చేయగలిగింది. ఇక్కడ కేసులు ఇప్పటికీ వందల్లోనే ఉన్నాయి. ఇక మృతుల సంఖ్య దాదాపు సున్నా అని వియత్నాం ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న ఈ చిన్నదేశం కరోనాను ఎలా కట్టడి చేసిందో తెలుసా..
నిజానికి వియత్నాం మధ్యతరహా దేశం. వైద్య వ్యవస్థ ఆధునికతను ఇంకా సంతరించుకోలేదు. అయితేనేం, ముందు చూపు లో విషయంలో పెద్ద దేశాలను మించిపోయింది. కరోనాను సమర్థంగా కట్టడి చేయడమే అందుకు నిదర్శనం. చైనాలో కరోనా ప్రభావం గణనీయంగా ఉన్న తరుణంలోనే వియత్నాం మేల్కొంది. చైనాతో సరిహద్దును మూసేసింది. కరోనా పుట్టిన చైనాలో లాక్ డౌన్ జనవరి 20న ప్రారంభం కాగా, జనవరి 1 నుంచే వియత్నాం దశలవారీ లాక్ డౌన్ అమలు చేయడం మొదలుపెట్టింది.
వియత్నాంలో వైద్య సిబ్బంది, నిధులు చాలా తక్కువ. ఇక రాజధాని నగరం హోచిమిన్ సిటీలో ఐసీయూ కెపాసిటీ వేయిలోపే. ఈ నగర జనాభా 8 మిలియన్లు. దీంతో మొదటగా వ్యాధిగ్రస్తులను గుర్తించడం ప్రారంభించారు. వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. వారు ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారో తెలుసుకొని వారిని కూడా కనుగొని పరీక్షలు నిర్వహించారు. కరోనా బాధితులు తిరిగిన రూట్‌ను కలుసుకున్న వారిని నాలుగు అంచెలుగా విభజించి అందరికి పరీక్షలు నిర్వహించడంతో పాటు గృహ నిర్భంధం విధించారు. అవసరమైతే క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఇది ఒక ఉద్యమంలా సాగింది.
ఉగ్రవాదంపై నిఘా తరహాలో కరోనా అనుమానితుల కోసం ఇంటెలిజెన్స్ వర్గాలు వేట సాగించాయి. ఇంట్లోనే ఉండడం ద్వారా కరోనాను రూపుమాపగలమంటూ విస్తృతస్థాయిలో ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేశాయి. శానిటైజర్లు, మాస్కులను ప్రభుత్వమే సరఫరా చేసింది. కేవలం మూడ్నాలుగు వారాల్లోనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. కొత్త కేసులేవీ నమోదు కాకపోవడంతో లాక్ డౌన్ ఎత్తివేశారు.అయితే, నిఘా మాత్రం కొనసాగుతూనే ఉంది.
చైనాకు దూరంగా వేలమైళ్ల దూరంలో ఉన్న దేశాలు సైతం కరోనా వైరస్ ప్రభావంతో వణికిపోతుంటే పక్కనే ఉన్న వియత్నాం మాత్రం ముందు చూపుతో కట్టడి చేయగలిగింది. అందుకే మనమూ సామాజిక దూరం పాటిద్దాం.. కరోనా ను తరిమికొట్టడంలో మనవంతు కృషి చేద్దాం.