హైదరాబాద్‌: ‘కరోనావైరస్ గ్రామాలకు పాకితే భారత్ పరిస్థితి ఏంటి?’ అంటూ బీబీసీ తెలుగు కథనం రాసింది. ఆ కథనం మేరకు.. భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. చాప కింద నీరులా కరోనా.. మన దేశంలో విస్తరిస్తోంది. ఇప్పటి వ రకు 748 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.

ఈ నెల 3వ తేదీన భారత్‌లో కేవలం ఐదు కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఆ తర్వాత రోజు నుంచి కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ.. ఇప్పుడు 748కి చేరింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు కరోనా వైరస్‌ పాకితే.. అదుపు చేయడం చాలా కష్టమని నిపుణులు అంటున్నారు. దేశ వ్యాప్తంగా 26 వేల ప్రభుత్వాసుపత్రులు ఉండగా.. అందులో 21 వేల ఆస్పత్రులు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే.. మిగిలినవి పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయని నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌-2019 నివేదిక చెబుతోంది. దీని ప్రకారం రోగుల సంఖ్య.. ఆస్పత్రిలోని పడకల సంఖ్య నిష్పత్తి ఆందోళనకర స్థాయిలో ఉందని తెలిసింది.

కరోనా పాజిటివ్‌ కేసుల సంక్య పెరుగుతూ పోతే గ్రామీణ ప్రాంతాల్లోని పడకలు కూడా చాలవని ఆ నివేదిక చెబుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 3,100 మందికి ఒక్క పడక మాత్రమే అందుబాటులో ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1700 మంది రోగులకు ఒక్క పడక చొప్పున మాత్రమే అందుబాటులో ఉన్నాయని బీబీసీ తెలుగు చెప్పింది. ఆస్పత్రి పడకలు.. జనాభా నిష్పత్తిని బట్టి చూస్తే.. బిహార్‌ చాలా వెనుక స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. బిహార్‌ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 10 కోట్ల మంది నివసిస్తున్నారు. అక్కడ ప్రతి 16 వేల మందికి ఒక్కటే పడక ఉంది. ఇక ఈ విషయంలో తమిళనాడు రాష్ట్రం మెరుగ్గా ఉంది. ఆ రాష్ట్రంలో 40,179 ఆస్పత్రి పడకలు ఉన్నాయి. దీని ప్రకారం.. తమిళనాడులో 800 మందికి ఒక పడక గది అందుబాటులో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 690 ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత కూడా తీవ్రంగానే ఉంది. భారత ఆరోగ్య గణంకాల ప్రకారం.. ప్రతి 26 వేల మంది ఒక అల్లోపతి వైద్యుడు మాత్రమే ఉన్నాడు. ప్రతి వెయ్యి మందికి ఒకరు చొప్పున అల్లోపతి వైద్యులు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రికార్డుల ప్రకారం దేశంలో 1.1 కోట్ల మంది అల్లోపతి వైద్యులు ఉన్నారని బీబీసీ తెలుగు చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన రీతిలో వైద్యులు, వసతులు లేవని తెలుస్తోంది.

ఐసీఎంఆర్‌ ఆమోదం పొందిన ప్రభుత్వ ల్యాబ్‌లో భారత్‌లో 116 ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 89 ల్యాబ్‌లు కరోనా వైరస్‌ పరీక్షలకు ఉపయోగిస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.