10 వేల లీటర్ల కోకా-కోలాను వారు ఏమి చేశారంటే..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Aug 2020 1:37 PM GMTకోకా కోలా లోకి బేకింగ్ సోడా కానీ మెంటోస్ లాంటివి వేస్తే అది పొంగుతుందని చాలా మందికి తెలిసిందే.. ఇలాంటి ప్రయోగాలను చాలా మంది ఎన్నో ఏళ్లుగా చేస్తూ ఉన్నారు. రష్యాకు చెందిన యూట్యూబర్ మాత్రం ఈ ప్రయోగాన్ని పెద్ద ఎత్తున ప్లాన్ చేశాడు.
ఒక లీటర్ కోకా కోలా మీద ప్రయోగం చేసి ఉంటే అతడు చేసింది చాలా సాధారణ ప్రయత్నం అని మనం భావించవచ్చు.. కానీ అతడు ఏకంగా 10వేల లీటర్ల కోకా కోలా ప్రయోగాన్ని చేసి చూపించాడు. అతడికి దాదాపు నాలుగు సంవత్సరాల సమయం పట్టింది. మ్యాగ్జిమ్ మోనాఖొవ్ అనే వ్యక్తి ఈ ప్రయోగాన్ని చేసి చూపించాడు. ఒక ఎగసే అగ్ని పర్వతం లాగా అతడు కోకా-కోలాను ఉపయోగించాడు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.
మోనాఖొవ్ తన టీమ్ సహాయంతో ఈ ప్రయోగాన్ని విశాలమైన ప్రదేశంలో చేసి చూపాడు. 700000 రూబెల్స్ ను ఈ ప్రయోగం కోసం ఖర్చు చేసాడు మోనాఖొవ్. ఓ పెద్ద గీజర్ ను ఉపయోగించి ఈ ప్రయోగం చేసి చూపించారు. 20 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ఓ పెద్ద గీజర్ ను తీసుకుని అందులో కొన్ని వేల లీటర్ల కోకా కోలాను నింపుతూ వచ్చాడు.. అందులోకి ఒక్క సారిగా ఒక బకెట్ బేకింగ్ సోడాను వేశారు. వెంటనే ఆ గీజర్ పై నుండి కోకా కోలా మొత్తం ఆ ప్రాంతంలో ఎగసిపడింది. అగ్నిపర్వతం నుండి లావా ఎలాగైతే బయటకు వస్తుందో అలా ఎగసిపడింది.
ఈ వీడియోను ఆగష్టు 21న అప్లోడ్ చేయగా ఇప్పటికే 7 మిలియన్ల వ్యూస్ ను దాటేసింది. లక్షకు పైగా కామెంట్లు వచ్చాయి. మోనాఖొవ్ ను అతడి టీమ్ ను అభినందిస్తూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. తామందరూ చిన్న చిన్న బాటిల్స్ లో ఈ ప్రయోగాలను చేశామని.. మీరు ఇంత భారీగా చేయడం సూపర్ గా ఉందని చెబుతున్నారు.