వాహనాలకు నంబర్‌ ప్లేట్లు అలా ఉంటే జైలుకే

By సుభాష్  Published on  12 March 2020 10:59 AM GMT
వాహనాలకు నంబర్‌ ప్లేట్లు అలా ఉంటే జైలుకే

నగరంలో చైన్‌ స్నాచింగ్‌ కేసులో అధికంగా నమోదవుతున్నాయి. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఈ చైన్‌ స్నాచింగ్‌ కేసులను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ హైదరాబాద్‌ వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. వాహనదారులు నంబర్‌ ప్లేటును సరిగ్గా కనిపించేలా ఉండకపోతే వారిని గొలుసు దొంగతనాలు చేసే వ్యక్తులుగా అనుమానించడం జరుగుతుందని, అంతే కాదు అలాంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

తప్పుడు నంబర్‌ ప్లేట్‌తో తిరుగుతున్న దాదాపు 2వేల వాహనాలకు సంబంధించి వివరాలు రికార్డులో నమోదై ఉన్నాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వాహనాలకు స్పష్టంగా లేని నంబర్‌ ప్లేటుతో తిరుగుతున్న 384 మంది వాహనదారులపై మంగళవారం కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. నంబర్‌ ప్లేటు లేకుండా రోడ్లపై కనిపిస్తే వెంటనే ఫోటో తీసి 9490616555 నంబర్‌కు వాట్సాప్‌ చేయాలని సూచించారు.

నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులు తరచూ నంబర్‌ కనిపించకుండా చేయడం, నంబర్‌ ప్లేటుపై అక్షరాలు సరిగ్గా కనిపించకుండా చేయడం, అలాగే మరి కొందరు ట్రాఫిక్‌ చలానాలు ఉండవనే ఉద్దేశంతో నకిలీ నంబర్‌ ప్లేట్లతో తిరుగుతుంటారని, అలాంటి వారిపై ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇక నుంచి నంబర్‌ ప్లేటు విషయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.



Next Story