బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ పై నిషేధం ఉంది. ప్రభుత్వం హుక్కా సెంటర్లన్నిటినీ మూసేసింది. కానీ మన నవాబుల నగరం భాగ్యనగరంలోని సందుగొందుల్లో, మారుమూలల్లో హుక్కా సెంటర్లు రహస్యంగా పొగజిమ్ముతూనే ఉన్నాయి.

మారు మూల భవనాల్లోని సందుగొందుల్లో, నరసంచారం లేని చోట్లలో మూసిన తలుపుల మాటున, వేలాడుతున్న తాళాల వెనుక హుక్కా సెంటర్ల నుంచి ఆ తియ్యటి పచ్చి యాపిల్ వాసన వస్తోంది. పొగలు రగులుతూనే ఉన్నాయి. అవును హుక్కా సెంటర్లు రహస్యంగా నడుస్తూనే ఉన్నాయి. గుడగుడమంటూ హుక్కా శబ్దాలు వస్తూనే ఉన్నాయి. ఆ పొగకు మనకు కళ్లు అడ్జస్ట్ కావడానికి కాస్త సమయం పట్టొచ్చు. కానీ కాస్సేపటికి కళ్లు అలవాటు పడతాయి. పొగల పరదాల మాటున ముఖాలు కనిపిస్తాయి. రహస్య నవాబుల నగరి మనకు స్వాగతం పలుకుతుంది.

కోప్టా, బహిరంగ ప్రదేశాల్లో పొగత్రాగడంపై నిషేధ చట్టం 2008 వంటి చట్టాలను వెక్కిరిస్తూ రహస్య హుక్కా సెంటర్లు నడుస్తూనే ఉన్నాయి. పలు మార్లు పోలీసులు సోదాలు నిర్వహించినా, ఈ సెంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇదివరకు లాగా ఎవరు బడితే వారికి ప్రవేశం లేదు. పాత కస్టమర్లకు, బాగా తెలిసిన వారికి మాత్రమే ప్రవేశం లభిస్తుంది. కొత్తవారు రావాలంటే పాతవారు సిఫార్సు చేయాల్సిందేనని బంజారా హిల్స్ లోని ఒక రహస్య హుక్కా పార్లర్ యజమాని చెబుతున్నారు. “నిషేధం తరువాత కూడా మా కస్టమర్లు పదేపదే హుక్కా గురించి వాకబు చేసేవారు. దాంతో రహస్య పార్లర్ ను స్టార్ట చేయకతప్పలేదు” అన్నారు హుక్కాపార్లర్ ఉద్యోగి ఇనాయత్ ఖాన్.  మామూలు హోటళ్ల పై అంతస్తుల్లో, చీకటి దారులు దాటిన తరువాత పైన గదుల్లో తలుపులు మూసి హుక్కా పార్లర్లు నడుస్తున్నాయి. మనం వెళ్తే ముందు మేనేజర్ మన పేరును సిఫార్సు చేయాలి. ఆ తరువాత సీసీ టీవీ కెమెరాలలో మనల్ని చూసి గానీ లోపలికి రానీయరు. అంత పకడ్బందీగా వ్యాపారం కొనసాగుతుంది. బయటనుంచి చూస్తే తాళాలు మూసే ఉంటాయి. కానీ లోపల మాత్రం భలే హడావిడి ఉంటుంది. మత్తైన మ్యూజిక్, మనసైన హుక్కా మనల్ని పలకరిస్తూంటాయి.

తలుపులు కొట్టేందుకు కూడా ఒక పద్ధతి ఉంది. ఎవరికి వారికి ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. బంజారా హిల్స్ లోకి ఒక పార్లర్ తలుపును ముందు మూడుసార్లు నెమ్మదిగా కొట్టాలి. తరువాత ఒక సారి గట్టిగా కొట్టాలి. అప్పుడే తలుపులు తెరుచుకుంటాయి. హుక్కా కివి, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, ద్రాక్ష వంటి వివిధ పరిమళాల్లో దొరుకుతాయి. నీరు మరిగేందుకు వాడే బొగ్గులోనూ వివిధ రకాలున్నాయి.

అయితే పోలీసులు మాత్రం ఇలాంటి రహస్య హుక్కా పార్లర్ల వివరాలు ఇస్తే ఖచ్చితంగా దాడి చేస్తామని చెబుతున్నారు. తాము చట్టాన్ని దృఢంగా అమలు చేస్తామని కూడా హామీ ఇస్తున్నారు. కానీ పోలీసులు వస్తే హుక్కా సెంటర్లు “ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్” అయిపోతున్నారు. మొత్తం మీద హుక్కా ప్రియులకు, పోలీసులకు మధ్య దాగుడుమూత దండాకోర్ కొనసాగుతూనే ఉంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.