కరోనా సోకుతుంది.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ టెస్టులు నిలిపేయండి

By Newsmeter.Network  Published on  12 March 2020 10:53 AM GMT
కరోనా  సోకుతుంది.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ టెస్టులు నిలిపేయండి

ముఖ్యాంశాలు

  • అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్‌ అనుమానితులు చికిత్సపొందుతున్నారు. ఈపరిణామాల నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆసక్తికర అంశాన్ని లేవనెత్తారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో టీఆర్‌ఎస్‌ నేత , ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు నిలిపివేయాలని కోరారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రజలు వణికిపోతున్నారని, ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్‌ పోలీసులు ఒకే స్ట్రాతో ఇద్దరు, ముగ్గురు వాహనదారులను పరీక్షిస్తున్నారని అన్నారు. దీని ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశం ఉంటుందని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొద్దిరోజుల పాటు ప్రభుత్వం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు లేకుండా ఉండేలా చూడాలని కోరారు.

దీనికి హోం మంత్రి మహమూద్‌ అలీ వివణ ఇచ్చారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి చెప్పిన విషయంపై ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా భారత్‌లోనూ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం నాటికి దేశంలో మొత్తం 73కరోనా కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్‌ 15 వరకు అన్ని దేశాలకు వీసాలను రద్దు చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు సమాచారం.

Next Story