సెప్టెంబ‌ర్‌లో ఐదువారాల ఐపీఎల్‌..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2020 4:07 PM GMT
సెప్టెంబ‌ర్‌లో ఐదువారాల ఐపీఎల్‌..!

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి క్రీడారంగం కుదేలైంది. క‌రోనా ముప్పుతో ప‌లు టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని ర‌ద్దు అయ్యాయి. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 13వ సీజ‌న్ ఏప్రిల్ 15కు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డంతో 14వ తేదీ వ‌ర‌కు అన్ని ర‌కాల కార్య‌క‌ల‌పాలు వాయిదా ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ అనుకున్న‌ట్లు 15న జ‌ర‌ప‌డం సాధ్యం కాద‌ని తేలిపోయింది.

క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తే ఐసీసీ ప్ర‌పంచ క‌ప్ ముందు ఐదు వారాల ఐపీఎల్ టోర్నీని నిర్వ‌హిస్తే బాగుంటుంద‌ని ఇంగ్లాండ్ మాజీ సార‌థి మైకేల్ వాన్ అన్నారు. నాదో ఆలోచ‌న ఆస్ట్రేలియాలో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు ఐదు వారాల ఐపీఎల్ నిర్వ‌హిస్తే బాగుంటుంది. మెగాటోర్నీకి ముందు ఆట‌గాళ్లంద‌రూ దీనిని స‌న్నాహ‌కంగా ఉప‌యోగించుకుంటారు. ప్ర‌పంచ‌క‌ప్ ముందు ఇదెంతో కీల‌కం అని వాన్ ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశాడు. వాన్ ఆలోచ‌న బ‌ట్టి సెప్టెంబ‌ర్‌లో ఐపీఎల్ నిర్వ‌హించాల్సి ఉంటుంది. అయితే.. సెప్టెంబ‌ర్‌లో టీమ్ఇండియా ఆసియాక‌ప్ లో ఆడాల్సి ఉంది.



ఐపీఎల్ నిర్వ‌హ‌ణ గురించి బోర్డు వర్గాలు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాయి. ఈనెల 14న లాక్ డౌన్ కాల‌ప‌రిమితి ముగియడంతో అనంత‌రం ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం ఐపీఎల్ గురించి ఆలోచిస్తామ‌ని పేర్కొన్నాయి. ఒక ఫ్రాంచైజీ ప్ర‌తినిథి మాట్లాడుతూ.. గ‌తంలో బోర్డు కార్యాల‌యంలో స‌మావేశం నిర్వ‌హించామ‌ని, అనంత‌రం మ‌రో స‌మావేశం ఐపీఎల్ గురించి జ‌ర‌పాల్సి ఉండ‌గా.. లాక్ డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డింద‌ని గుర్తు చేశాడు. 14 తర్వాత ఐపీఎల్‌పై బోర్డుతో ఫ్రాంచైజీలు సమావేశమవుతాయని పేర్కొన్నాడు.

Next Story