వేలానికి జోస్‌బ‌ట్ల‌ర్ ప్ర‌పంచ‌క‌ప్‌ జెర్సీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2020 2:19 PM GMT
వేలానికి జోస్‌బ‌ట్ల‌ర్ ప్ర‌పంచ‌క‌ప్‌ జెర్సీ

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి ఎంతో మంది క్రీడాకారులు ముందుకు వ‌చ్చి త‌మ వంతు సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా.. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మ‌న్ జోస్ బ‌ట్ల‌ర్ త‌న వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు.

'ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో నేను ధరించిన జెర్సీని వేలం వేద్దామనుకుంటున్నా. వచ్చిన సొమ్మును లండన్‌లోని రాయల్‌ బ్రాంప్టన్‌, హారెఫైడ్‌ ఆస్పత్రులకు అందిస్తాను. కోవిడ్‌-19 బాధితులకు సేవలందిస్తున్న ఈ రెండు ఆస్పత్రులు తగినంత వైద్య పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్నాయి. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. ఇంటి వద్దే ఉండండి. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయండి' అని బట్లర్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో వైద్య సిబ్బంది ప్రాణాల‌కు తెగించి పోరాడుతున్నార‌ని వారికి మ‌న‌వంతు సాయం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నాడు.

2019 జులై 14న లార్డ్స్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. సూప‌ర్ ఓవ‌ర్ నిర్వ‌హించ‌గా.. ఇక్క‌డ కూడా ఇరు జ‌ట్లు స‌మానంగా నిలిచాయి. కాగా బౌండ‌రీల ఆదారంగా ఇంగ్లాండ్‌ను విజేత‌గా నిర్ణ‌యించారు. కాగా ఇంగ్లాండ్‌కు ఇదే తొలి ప్ర‌పంచ‌క‌ప్ కావ‌డం విశేషం.



Next Story