'హిందీలోనే మాట్లాడుతాం.. ఎందుకంటే మేం భార‌తీయులం'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2020 1:58 PM GMT
హిందీలోనే మాట్లాడుతాం.. ఎందుకంటే మేం భార‌తీయులం

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణిక‌స్తోంది. లాక్‌డౌన్ నేప‌థ్యంలో భార‌త క్రికెట‌ర్లు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్‌శ‌ర్మ బుధ‌వారం ఇన్‌స్టాగ్రామ్‌లో పేస్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రాతో క‌లిసి లైవ్‌చాట్ చేశాడు. ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌పై రోహిత్‌శ‌ర్మ అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ‘ మీరిద్దరూ హిందీలో ఎందుకు మాట్లాడుతున్నారు.. ఇంగ్లిష్‌లో మాట్లాడవచ్చు కదా’ అని ఓ అభిమాని అడిగాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రోహిత్.. ఆ అభిమానికి వెంట‌నే ఘాట్ రిప్లై ఇచ్చాడు. ‘ మేము భారతీయులం. హిందీలోనే మాట్లాడతాం. టీవీ ఇంటర్యూల్లో ఇంగ్లిష్‌లో మాట్లాడతా. నేను ప్రస్తుతం ఇంటి వద్దనే ఉన్నా’ అంటూ అసహనంగా బదులిచ్చాడు.

అనంత‌రం బుమ్రా మాట్లాడుతూ.. 'రోహిత్‌కు అండ‌గా నిలిచాడు. మ‌నం హిందీలో మాట్లాడితే వాళ్లు ఇంగ్లీష్‌లో మాట్లాడ‌మంటారు. ఇంగ్లీష్‌లో మాట్లాడితే హిందీలో మాట్లాడ‌మంటారు' అని హిట్‌మ్యాన్‌కు మ‌ద్ద‌తుగా నిలిచాడు.

వీరిద్దరూ ప్రధానంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌ గురించే లైవ్‌ చాట్‌లో మాట్లాడారు. ఐపీఎల్‌ జరుగుతుందా.. లేదా అనే విషయాన్ని ప్రస్తావించకుండానే, మన సన్నాహాలు ఎలా ఉండాలనే అంశాలపై చర్చించారు. మ‌రో వైపు క‌రోనా మ‌హ‌మ్మారి వ్ల‌ల ఇలాంటి ప‌రిస్థితులు త‌లెత్తుతాయ‌ని కివీస్ ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా తానెప్పుడు ఊహించ‌లేద‌ని బుమ్రా తెలిపాడు. ఈ వైర‌స్ వ్యాప్తి వ‌ల్ల అన్ని క్రికెట్ కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయ‌ని, దీన్ని బ‌ట్టి ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవాల‌ని అభిమానుల‌ను ఉద్దేశించి హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.

Next Story
Share it