28ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెరదించిన వేళ‌..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2020 7:37 AM GMT
28ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెరదించిన వేళ‌..

భార‌త అభిమానుల సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ.. తొమ్మిదేళ్ల క్రితం స‌రిగ్గా ఈ రోజున టీమిండియా రెండో సారి వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌ను ముద్దాడింది. వాంఖ‌డే వేదిక‌గా 2011 ఏప్రిల్ 2న నాటి భార‌త కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని ఫైన‌ల్‌లో శ్రీలంక పై కొట్టిన సిక్స్ ఇప్ప‌టికి అభిమానుల క‌ళ్ల‌లో క‌దులుతూనే ఉంది. 1983లో తొలిసారి కపిల్‌దేవ్ సారథ్యంలో భారత్ జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలవగా.. ఆ తర్వాత ధోనీ కెప్టెన్సీలో 2011లో మరోసారి టీమిండియా ప్ర‌పంచ‌కప్‌ని ముద్దాడింది. ఆ అపురూప క్షణాల్ని నెమరు వేసుకుంటూ అభిమానులు ఎంజాయ్ చేయడానికి ఈరోజు మళ్లీ స్టార్‌స్పోర్ట్స్ ఛానల్ ఆ ఫైనల్ మ్యాచ్‌ని ప్రసారం చేయబోతున్నట్లు ప్రకటించింది. త‌ర్వాత రెండు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లు జ‌రిగినా టీమ్ఇండియా సెమీస్ నుంచే నిష్ర్క‌మించింది. మ‌ళ్లీ ఎప్పుడు విశ్వ‌విజేత‌గా నిలుస్తుంద‌నే ఆశ‌తో కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మొద‌ట టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. మ‌హేల జ‌య‌వ‌ర్థ‌నే (103 నాటౌట్: 88 బంతుల్లో 13x4) అజేయ సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 274 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ ఉపుల్ త‌రంగ(2) జ‌హీర్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన కెప్టెన్ సంగ‌క్క‌ర(48), దిల్షాన్‌(33) క‌లిసి జ‌ట్టును ఆదుకున్నాడు. వీరిద్ద‌రు రెండో వికెట్‌కు 43 ప‌రుగులు జోడించాక భజ్జీ బౌలింగ్‌లో దిల్షాన్ బౌల్డ్ అయ్యాడు. సంగ‌క్క‌రకు జ‌త‌క‌లిసిన జ‌య‌వ‌ర్డ‌నే భార‌త బౌల‌ర్ల‌పై చెల‌రేగాడు. దీంతో స్కోర్ బోర్డు ప‌రుగులు పెట్టింది. అర్థ‌శ‌త‌కానికి రెండు ప‌రుగుల దూరంలో సంగక్క‌ర ధోని చేతికి చిక్కాడు. అనంత‌రం స‌మ‌ర‌వీర‌(21), క‌పుగెద‌ర‌(1), కుల‌శేఖ‌ర‌(32) ల‌తో క‌లిసి జ‌య‌వ‌ర్థ‌నే ఆదుకునే ప్ర‌య‌త్నం చేశాడు. భార‌త బౌల‌ర్ల‌లో యువీ, జ‌హీర్ రెండేసి వికెట్లు తీయ‌గా, హ‌ర్భ‌జ‌న్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

లక్ష్య ఛేదనలో భారత్‌కి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే పెవిలియ‌న్ చేరారు. దీంతో భార‌త్ 31 ప‌రుగుల‌కే రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. వ‌న్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌ గౌతమ్ గంభీర్ (97; 122 బంతుల్లో 9x4) ఆదుకున్నాడు. విరాట్ కోహ్లీ (35)తో క‌లిసి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్ద‌రూ మూడో వికెట్ 83 జోడించాక కోహ్లీ పెవిలియ‌న్ చేరాడు. గంభీర్ కు, అప్ప‌టి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (91 నాటౌట్; 79 బంతుల్లో 8x4, 2x6) జ‌త‌క‌లిసాడు. వీరిద్ద‌రు నాలుగో వికెట్‌కు శ‌త‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. సెంచ‌రీకి చేరువైన గంబీర్ పెరీరా బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి బౌల్డ్ అయ్యాడు. అనంత‌రం ధోని సూప‌ర్ ఫామ్‌లో ఉన్న యువీ (21 24 బంతుల్లో 2x4) క‌లిసి టీమ్ఇండియాకు విజ‌యాన్ని అందించాడు. దీంతో.. 48.2 ఓవర్లలోనే భారత్ జట్టు 277/4తో విజయాన్ని అందుకోగా.. ధోనీ కళ్లుచెదిరే సిక్స్‌తో మ్యాచ్‌ ముగించి భారత్‌ని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు.

Next Story
Share it