గంగూలీ కోసమే లక్ష్మణ్‌కు చోటివ్వ‌లేదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2020 3:43 PM GMT
గంగూలీ కోసమే లక్ష్మణ్‌కు చోటివ్వ‌లేదు

ఆస్ట్రేలియా దిగ్గ‌జ క్రికెట‌ర్ షేన్‌వార్న్.. తాను క్రికెట్ ఆడిన కాలంలో భార‌త అత్యుత్త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించాడు. 11 మంది ఆట‌గాళ్ల‌తో కూడిన ఈ జ‌ట్టుకు బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్‌గంగూలీని కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. ఓపెన‌ర్లుగా విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, న‌వ‌జోత్ సింగ్ సిద్ధును ఎంపిక చేసిన ఈ స్పిన్ దిగ్గ‌జం.. ఆస్ట్రేలియా పై ఎన్నో రికార్డుల‌ను సాధించిన వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ను ఎంపిక చేయ‌లేదు. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ల‌క్ష్మ‌ణ్‌కు వార్న్ త‌న జ‌ట్టులో చోటు ఇవ్వ‌క‌పోవ‌డం పై పెద్ద ఎత్తున చ‌ర్చ మొద‌లైంది. దీనిపై వివరణ ఇచ్చిన వార్న్‌ జట్టు కూర్పులో భాగంగానే లక్ష్మణ్‌కు చోటు ఇవ్వలేదని తెలిపాడు.

'న‌వ‌జోత్ సింగ్ సిద్ధు స్పిన్ బౌలింగ్‌లో అద్భుతంగా ఆడ‌తాడని, ఈ విష‌యాన్ని ఎంతో మంది స్పిన‌ర్లు త‌న‌కు చెప్పార‌ని.. అందుకే అత‌డిని ఓపెన‌ర్‌గా ఎంపిక' చేశాన‌న్నాడు. ఇక మూడో స్థానంలో ది వాల్ రాహుల్ ద్రావిడ్ ఎంపిక చేశాడు. 'ద్ర‌విడ్ నాకు మంచి స్నేహితుడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌రుపున ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ప్పుడు అత‌డి గురించి ఎంతో తెలుసుకున్నా. అత‌డు ఆసీస్ పై ఎన్నో శ‌త‌కాలు బాదాడని' చెప్పాడు. నాలుగు స్థానంలో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ఎంపిక చేసిన వార్న్ అయిదో స్థానంలో అజారుద్దీన్‌కు చోటిచ్చాడు. ఇక‌ ఆరో స్థానంలో సౌర‌వ్ గంగూలీ ఎంపిక చేశాడు. 'దాదా సార‌థిగా ఉండాల‌ని భావించా. అందుకే ల‌క్ష్మ‌ణ్‌కు చోటు ఇవ్వ‌లేద‌ని' వార్న్ తెలిపాడు. అయితే కపిల్‌ దేవ్‌, అజహరుద్దీన్‌లను ఎంపిక చేసినప్పటికీ వారికి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడానికి వార్న్‌ అనాసక్తి కనబర్చడం విశేషం. ఇక ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లిలతో తను అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకపోవడంతో వారిని ఎంపిక చేయలేదని వివరణ ఇచ్చాడు.

వార్న్‌ అత్యుత్తమ భారత జట్టు:

సౌరవ్‌ గంగూలీ(కెప్టెన్‌), నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ, వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌, మహ్మద్‌ అజహరుద్దీన్‌, నయాన్‌ మోంగియా, కపిల్‌ దేవ్‌, హర్భజన్‌ సింగ్‌, అనిల్‌ కుంబ్లే, జవగల్‌ శ్రీనాథ్‌

Next Story