గంగూలీలా ధోని మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు : యువీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2020 1:06 PM GMT
గంగూలీలా ధోని మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు : యువీ

త‌న కెరీర్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ల‌లో సౌర‌వ్ గంగూలీనే అంద‌రి కంటే ఎక్కువ మ‌ద్ద‌తు ఇచ్చాడ‌ని భార‌త మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ అన్నాడు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ప్ర‌స్తుత సార‌థి విరాట్ కోహ్లీ కంటే గంగూలీ కెప్టెన్ గా ఉన్న స‌మ‌యంలోనే త‌న కెరీర్ ఉత్త‌మంగా సాగింద‌న్నాడు.

టీమ్ఇండియా త‌రుపున యువీ 304 వ‌న్డేలు ఆడ‌గా.. గంగూలీ కెప్టెన్సీలో 110 మ్యాచ్‌లు, ధోని సారథ్యంలో 104 మ్యాచ్‌లు ఆడాడు. ‘సౌరవ్‌ కెప్టెన్సీలో నేను ముందుగా ఆడాను. ఆ సమయంలో అతను నాకు చాలా అండగా నిలిచాడు. ఆ తర్వాత ధోని కెప్టెనయ్యాడు. ఇద్దరిలో ఎవరు అత్యుత్తమమో చెప్పడం కొంత కష్టం. అయినా.. సౌరవ్‌ మద్దతుగా నిలిచిన సమయంలోనే నా కెరీర్‌ మధురానుభూతులు ఉన్నాయి. ధోని నుంచి గానీ ఆ తర్వాత కోహ్లి నుంచి గానీ నాకు ఆ తరహా మద్దతు ఎప్పుడూ లభించలేదు’ అని యువీ వ్యాఖ్యానించాడు.

తాను క్రికెట్ ఆడిన స‌మ‌యంలో శ్రీలంక స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్‌, ఆసీస్ పేస‌ర్ మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో ఎక్కువ‌గా ఇబ్బంది ప‌డ్డాన‌ని తెలిపారు. అయితే.. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండ్కూల‌ర్ ఇచ్చిన స‌ల‌హాతో ముర‌ళీ ధ‌ర‌న్ బౌలింగ్‌లో స్వీప్ చేయ‌డం మొద‌లు పెట్టాక ప‌రిస్థితి మెరుగైంద‌ని చెప్పాడు.

తాను టెస్టు జ‌ట్టులో రెగ్యుల‌ర్ కాక‌పోవ‌డం వ‌ల్ల మెక్‌గ్రాత్ బౌలింగ్‌ను ఎక్కువ‌గా ఎదుర్కొనే అవ‌కాశాలు పెద్ద‌గా రాలేద‌ని అన్నాడు. ఐపీఎల్‌ వచ్చిన తర్వాత కుర్రాళ్లకు చాలా డబ్బు వచ్చిపడుతోందని, దాంతో వారు తమ సీనియర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని యువరాజ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

‘ఐపీఎల్‌ లేని రోజుల్లో నేను అరంగేట్రం చేశాను. నేను టీవీలో ఆరాధించే హీరోలతో కలిసి ఆడే అవకాశం వచ్చినప్పుడు వారంటే ఎంతో గౌరవం చూపించాను. ఎలా ప్రవర్తించాలో, మీడియాతో ఎలా మాట్లాడాలో వారు నేర్పించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కొందరు ఈతరం కుర్రాళ్లతో మాట్లాడుతుంటే వారు సీనియర్లను ఏమాత్రం లెక్క చేయరని అర్థమైంది. నేను ద్రవిడ్, వెంకటేశ్‌ ప్రసాద్, కుంబ్లేలాంటి వారితో తిట్లు కూడా తిన్నాను. కానీ వారి ద్వారా ఎంతో నేర్చుకున్నాను కూడా’ అని యువీ విశ్లేషించాడు.

క‌రోనా మ‌హ‌మ్మారి వల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవ‌డం హృద‌య విదార‌కంగా ఉంది. ఇది చాలా వేగంగా విస్త‌రిస్తోంది. ప్ర‌జ‌లు ఎక్కువ‌గా భ‌య‌ప‌డ‌కుండా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌లో మ‌హ‌మ్మారి గురించి పూర్తిగా తెలుసుకోవాల‌న్నాడు.

2007టీ20, 2011 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌ల‌ను భార‌త్ సాధించ‌డంలో యువ‌రాజ్ కీల‌క‌పాత్ర పోషించాడు. మొత్తంగా యువ‌రాజ్ 304వ‌న్డేలు, 40 టెస్టులు, 58 టీ20లు ఆడాడు.

Next Story