ల‌బుషేన్‌పై ప్రాంక్‌ వీడియో.. మామూలుగా ఆడుకోలేదుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2020 2:45 PM GMT
ల‌బుషేన్‌పై ప్రాంక్‌ వీడియో.. మామూలుగా ఆడుకోలేదుగా

ఆస్ట్రేలియా యంగ్ బ్యాట్స్‌మెన్ మార్న‌స్ ల‌బుషేన్‌ను ఆ జ‌ట్టు కోచ్ జ‌స్టిన్ లాంగ‌ర్‌, ఆ జ‌ట్టు టెస్టు కెప్టెన్ టిమ్‌పైన్ క‌లిసి ఏప్రిల్ పూల్ చేశాడు. అయితే అది ఈ ఏడాది కాదులెండి. గ‌తేడాది చేసిన ఈ ప్రాంక్ వీడియోను ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ విడుద‌ల చేసిన 'ద టెస్టు' అనే డ్యాకుమెంట‌రీలో పొందుప‌రిచారు.

సౌతాఫ్రికాకు చెందిన మార్నస్ లబుషేన్‌ పదేళ్ల వయసులోనే ఆస్ట్రేలియాకు వలసవచ్చి ఇక్కడ క్రికెటర్‌గా ఎదిగాడు. గతేడాది ఆస్ట్రేలియా టెస్టు బ్యాట్స్‌మన్‌గా అరంగేట్రం చేసిన ఈ ఆట‌గాడిని కోచ్‌, కెప్టెన్ స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించారు. లబుషేన్‌ను ఆల్‌టైమ్ ఫేవరేట్ క్రికెటర్‌ ఎవరని ప్రశ్నించగా.. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాక్వెస్‌ కలిస్ అని స‌మాధాన‌మిచ్చాడు. దీంతో లాంగ‌ర్ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌ట్లు న‌టించి అత‌డిని ప‌క్క‌కు తీసుకెళ్లి ఇలా అన్నాడు. 'నువ్వు స‌మాధానం చెప్పేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌గా ఉంటూ క‌లిస్‌, డివిలియ‌ర్స్ పేర్లు చెప్ప‌డం స‌రికాదు. అలా చెబితే మ‌న ఆట‌గాళ్ల‌కి న‌చ్చ‌దు. వాళ్లు తేలిక‌గా తీసుకోరు' అంటూ ల‌బుషేన్‌ను హెచ్చ‌రించాడు. అది నిజమేనని అనుకున్న లబుషేన్‌.. 'సరే, అది నా ఉద్దేశం కాదు. ఇకపై ఇలాంటి ప్రశ్నలే ఎదురైతే ఏం చెప్పాలి?' అని కోచ్‌ను సలహా అడిగాడు. దీనికి లాంగర్‌ స్పందిస్తూ.. స్టీవ్‌స్మిత్‌ పేరు చెప్పమని సూచించాడు. ఆ తర్వాత టిమ్‌పైన్‌, జస్టిన్ లాంగర్‌ నవ్వుకుంటూ వచ్చి కెమెరాను చూస్తూ అందరికీ ఏప్రిల్‌ ఫూల్స్‌ డే శుభాకాంక్షలు చెప్పారు. అది తనమీద చేసిన ప్రాంక్‌ అని లబుషేన్‌కు అప్పుడు అర్థం అయ్యింది.Next Story
Share it