క్షీణించిన వరవరరావు ఆరోగ్యం
By తోట వంశీ కుమార్
తెలంగాణకు చెందిన ప్రముఖ విప్లవ కవి, విప్లవ రచయితల సంఘం మాజీ అధ్యక్షుడు పెండ్యాల వరవర రావు ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న వరవర రావు ముంబైలోని ప్రఖ్యాత నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వరవర రావు నరాలు, మూత్రపిండాల సమస్యలు తలెత్తినట్లు చెబుతున్నారు. మొదట ఆయనకు సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉండగా.. జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) వరవరావుకు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చికిత్స అందించాలని ఆదేశించింది. ఆయన్ను సెయింట్ జార్జ్ హాస్పిటల్ నుంచి నానావతి హాస్పిటల్‌కు తరలించారు. ఈ విషయాన్ని సెయింట్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు. వరవరరావు వైద్యానికి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించాలని జాతీయ మానవహక్కుల కమిషన్ సూచించింది.
జైలులో ఉన్న వరవరరావు కరోనా వైరస్ బారిన పడటంతో మొదట ఆయనను జేజే ఆసుపత్రికి, అనంతరం సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటకపోవడంతో నానావతి ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరవర రావు మూత్ర సంబంధిత ఇబ్బందులతో పాటూ, న్యూరో సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయని చెప్పారు. దీంతో మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను నానావతి ఆసుపత్రికి తరలించారు.
వరవరరావును పరిశీలించిన న్యూరాలజిస్టులు డెమెన్షియా సోకి ఉండే అవకాశం ఉందని అంటున్నారు. న్యూరొలాజికల్ లోపాలు కూడా ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. డెమెన్షియా కారణంగా మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుంది.