లాక్‌డౌన్ రూల్స్: పోలీసుల ఐడియా అదిరింది..!
By సుభాష్ Published on 12 April 2020 4:24 PM ISTదేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ పోలీసులు రకరకాలుగా చర్యలు చేపడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఎవ్వరూ కూడా బయటకు రావొద్దని లాక్‌డౌన్ అమలు చేసినా.. ప్రజలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఇక లాక్‌డౌన్ ఉల్లంఘనను కట్టిడి చేసేందుకు గుజరాత్‌లోని వడోదర నగరం పోలీసు ఉన్నతాధికారులు ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు.
అయితే లాక్‌డౌన్ నిబంధనలు ఎంత మంది ఉల్లంఘిస్తున్నారో తెలుసుకునేందుకు గాల్లో ఎగిరే బెలూన్ల సాయంతో నిఘా పెట్టనున్నారు. ఎవరెవరూ రోడ్లపైకి వస్తున్నారో వారిని బెలూన్లలో ఉండే కెమెరాలు ఫోటోలు తీస్తున్నాయి. దీంతో వారిపై కొరఢా ఝులిపిస్తున్నారు. కరోనా వైరస్ అధికం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు వడోదర నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించారు. రెడ్‌జోన్లలో కంటైన్మెంట్ నిబంధనలను అమలు చేస్తున్నారు.
రెడ్‌జోన్లలోని టాండాల్జా ఏరియాలో నిఘా పెంచేందుకు కెమెరాలతో ఉన్న రెండు హీలియం బెలూన్లను ఏర్పాటు చేశారు. ఈ బెలూన్లలో ప్రజలకు అప్పటికప్పుడు సూచనలు చేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్‌ని కూడా సిద్ధం చేశారు. ఇక అధికారులు ఎక్కడి నుంచి అయినా సరే మొబైల్ ఫోన్‌లలో స్థానికంగా ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.
రెడ్‌జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎటువంటి రాకపోకలు లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఇంటింటికి వెళ్లి నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు. అలాగే రెడ్ జోన్లు ఉన్నప్రాంతాల్లోని ఇంటింటికి వైద్యులు సైతం వెళ్లి పరీక్షిస్తున్నారు. ఇలా అధికారులు బెలూన్ల సాయంతో కొత్త టెక్నాలజీ ద్వారా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నవారి కదలికలను బెలూన్లలో ఉండే కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిపై కేసులు నమోదు చేస్తున్నారు గుజరాత్ పోలీసులు.