వారి స్థానాల్ని జగన్ ఎవరితో భర్తీ చేస్తారు?

By సుభాష్  Published on  20 Jun 2020 5:37 AM GMT
వారి స్థానాల్ని జగన్ ఎవరితో భర్తీ చేస్తారు?

రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. అందరి అంచనాలను నిజం చేస్తూ ఏపీ అధికారపక్షం నాలుగు స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణరావులు రాజ్యసభకు ఎంపికయ్యారు. దీంతో.. వారిప్పుడు రాష్ట్ర మంత్రి పదవులకు రాజీనామా చేయనున్నారు.

మరి.. తాజా ఖాళీల్ని భర్తీ చేసేదెప్పుడు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన రెవెన్యూ శాఖను బోస్ కు అప్పజెప్పగా.. మరో సన్నిహితుడు మోపిదేవికి సైతం మంచి పదవే ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరూ హస్తినకు వెళ్లిపోనున్న నేపథ్యంలో.. వారి స్థానంలో కొత్తగా వచ్చేవారెవరు?అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. త్వరలో తాను అనుకుంటున్నట్లుగా మండలిని రద్దు చేసిన పక్షంలో తనకు సన్నిహితులైన ఈ ఇద్దరు నేతలకు జరిగే నష్టాన్ని పరిగణలోకి తీసుకొని వారిని రాజ్యసభకు పంపారన్న వాదన వినిపిస్తుంటుంది. దీనికి తోడు.. ఈ ఇద్దరు జగన్ కు వీరవిధేయులన్నది మర్చిపోకూడదు. మరి.. వారి స్థానాల్ని ఎవరితో భర్తీ చేస్తారు? ఎప్పుడు చేస్తారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తాను కొలువుతీర్చిన కాబినెట్ ను రెండున్నరేళ్ల పాటు కొనసాగిస్తానని.. అప్పటివరకూ ఎవరిపదవులు ఊడిపోవన్న సంకేతాన్ని మొదటే ఇచ్చిన జగన్.. అందుకు తగ్గట్లే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఖాళీ అయిన స్థానాల్ని వీలైనంత త్వరగా భర్తీ చేసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడు రాజ్యసభకు ఎంపికైన ఇద్దరు మంత్రులు బీసీ నేతలే కావటంతో.. వారి రీప్లేస్ మెంట్ సైతం బీసీలకే చెందుతుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఆ ఇద్దరు నేతలు ఎవరన్న విషయం మీద మాత్రం ఇప్పుడే చెప్పలేమంటున్నారు. రెండు ఖాళీల్ని ఎవరితో భర్తీ చేస్తారు? ఎవరా అదృష్టవంతులన్న చర్చ ఏపీ అధికారపక్షంలో మహా జోరుగా సాగుతోంది.

Next Story