నీ దూకుడు.. సాటెవ్వరూ..!

By అంజి  Published on  6 Dec 2019 8:19 AM GMT
నీ దూకుడు.. సాటెవ్వరూ..!

హైదరాబాద్ : వి.సి.సజ్జనార్. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. అవును. నిజమే. దూకుడుగా నిర్ణయాలు తీసుకునే డైనమిక్ అధికారి ఆయన. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్ని ఒత్తిడులు ఎదురైనా వెనకడుగువేయని ధైర్యశాలి. ఉద్యోగాన్ని ఉద్యోగంగా మాత్రమే కాక ఒక సామాజిక బాధ్యతగా నిర్వర్తించే సమున్నత సంస్కార శీలి. మరోసారి ఆయన తన ధీర గంభీర వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచారు. జస్టిస్ ఫర్ దిశ కేసులో ఘటనాస్థలంలోనే నిందుతులు నలుగురూ ఎన్ కౌంటర్ కావడం సజ్జనార్ ఖ్యాతిని దేశవ్యాప్తం చేసింది. షాద్ నగర్ సమీపంలోని చట్టాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనా స్థలంలోనే నలుగురు నిందితులూ ఎన్ కౌంటర్ కావడం విశేషం.

మడమ తిప్పని వ్యక్తిత్వం సజ్జనార్‌ది..

1996 బ్యాచ్ కి చెందిన వి.సి.సజ్జనార్ ది మడమ తిప్పని వ్యక్తిత్వం. సమర్ధుడైన అధికారిగా అనేక సందర్భాల్లో ఆయన తన సత్తాని చాటుకున్నారు. నేరాలను, నేరస్తుల్ని అదుపుచేసే విషయంలో తనది ఒక ప్రత్యేకమైన శైలి. కేవలం నేరస్తులకు మాత్రమే కాక, ఆ నేరం చేయాలనే ఆలోచనకూ వెన్నులోంచి వణుకు పుట్టే రీతిలో ప్రతిస్పందించడం ఆయన నైజం. ఐజీ ర్యాంక్ లో ఉన్న సజ్జనార్ ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

2008లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరంగల్ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు జరిగిన ఓ యాసిడ్ దాడి ఉదంతం అప్పట్లో పెను సంచలనం. డిసెంబర్ 10, 208న కాలేజీనుంచి ఇంటికి వెళ్తున్న స్వప్నిక, ప్రణీత అనే ఇద్దరు అమ్మాయిలమీద శ్రీనివాస్ అనే నిందితుడు మరో ఇద్దరు అతని అనుచరులు యాసిడ్ దాడి చేశారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. నిందితులు ముగ్గురూ అప్పుడు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం జరిగింది.

అసలు మళ్లీ వరంగల్ జిల్లాలోనే ఇలాంటి దారుణం ఇంకెన్నడూ చోటుచేసుకోవడానికి వీల్లేని విధంగా అప్పట్లో సజ్జనార్ సముచితమైన నిర్ణయం తీసుకున్నారు. దాని పర్యవసానంగా నిందితులు ఎన్ కౌంటర్ లో హతులయ్యారు. మానవహక్కుల కార్యకర్తలు అప్పట్లో ఆ ఎన్ కౌంటర్ పై తారాస్థాయిలో నిరసనలు తెలిపారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని, చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకుని నిందితుల్ని కాల్చిచంపడం సరికాదంటూ విమర్శలు గుప్పించారు.

ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను..

కానీ ఆ విమర్శలనూ, నిరసనల్నీ సజ్జనార్ ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదు. "ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను" అంటూ ఓ తెలుగు సినిమా హీరో డైలాగులు చెప్పిన రీతిలో ఉంటుంది ఆయన ప్రవర్తన. అవసరమైనచోట ఎంత వేగంగా స్పందిస్తారో అనవసరమైనచోట అస్సలు నోరు విప్పి మాట్లాడనైనా మాట్లాడకుండా సంయమనం పాటించడం, స్పందించకపోవడం సజ్జనార్ కి వెన్నతో పెట్టిన విద్య. హైదరాబాద్ రియల్టర్లకు వెన్నులో వణుకు పుట్టించిన కరుడుగట్టిన నేరగాడు నయీమ్ ఎన్ కౌంటర్ లోకూడా సజ్జనార్ కీలక భూమిక పోషించారు. ఆ సమయంలో ఆయన స్పెషల్ ఇంటెలిజెన్స్ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ శివారులో నయీమ్ ఎన్ కౌంటర్ మరో పెను సంచలనం.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ నక్సల్స్ ప్రభావాన్ని అరికట్టే రీతిలో దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడంలో సజ్జనార్ ది అందెవేసిన చేయి. ఎస్.ఐ.బి అధినేతగా పలువురు మావోయిస్ట్ కీలక నేతల అరెస్ట్ వెనుక, ఎన్ కౌంటర్ల వెనుక సజ్జనార్ మేథోమధనం ఎంతో ఉంది. దీనికి సంబంధించి డి.జి.పి మహేందర్ రెడ్డికీ సజ్జనార్ కీ గతంలో తరచూ పలు సందర్భాల్లో కీలకమైన భేటీలు జరిగేవి. సజ్జనార్ పై పోలీస్ టాప్ బాస్ లకు అంతటి నమ్మకం ఉందంటే ఆయన సమర్థత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Next Story