వాగులో కొట్టుకుపోతున్న ఎమ్మెల్యే.. కాపాడిన అనుచరులు
By తోట వంశీ కుమార్ Published on 31 July 2020 11:40 AM ISTఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రోడ్లపై నుంచి వాగులు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను పరామర్శించి సాయం చేయడానికి ప్రజాప్రతినిధులు వెలుతున్నారు. అయితే.. ఓ ప్రజాప్రతినిధి ప్రవదవశాత్తు వరద నీటిలో పడ్డాడు. కొట్టుకుపోతున్న ఆ ఎమ్మెల్యేను కార్యకర్తలు, స్థానికులు కాపాడారు. ఉత్తరాఖండ్‌లో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్‌లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. పితోరాఘర్ జిల్లాలోని ధార్చులా ప్రాంతంలోని ప్రజల పరిస్థితిని తెలుసుకునేందుకు ఎమ్మెల్యే హరీశ్ ధామి కూడా వెళ్లారు. ఓ వాగును ఎమ్మెల్యే హరీశ్ దాటుతుండగా ఒక్కసారిగా జారి పడిపోయారు. వాగులో కొంత దూరం కొట్టుకుపోయారు. వెంటనే అప్రమత్తం అయిన అనుచరులు ఆయన్ను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. వాగులో ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరగడంతో ఎమ్మెల్యే హరీశ్ పడిపోయారని అక్కడి వారు చెప్పారు. ఆ నీరంతా చెత్తతో నిండి ఉందని చెప్పారు.
ఈ ఘటనలో ఎమ్మెల్యే హరీశ్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన హరీష్ ధామి.. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బుందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కొండప్రాంతాల నుంచి కొట్టుకువస్తున్న చెత్తాచెదారం, వరద నీటితో అవస్థలు పడుతున్నారని.. నీట మునిగిన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు విమానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.