గత నాలుగు రోజుల నుంచి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండడంతో అక్కడ జనజీవన వ్యవస్థ స్తంభించినట్లైంది. ఉద్యోగులు ఆఫీసులకు, విద్యార్థులు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన 24 గంటల్లోనే వర్షాల కారణంగా 28 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.

మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిసింది. వర్షం కారణంగా పలు చోట్లు గోడలు కూలడం, చెట్లు విరిగి పడిపోవడం, పిడుగులు పడడంతో వీరంతా మృతి చెందారని అధికారులు తెలిపారు. ఇక పిలిబిత్‌, సీతాపూర్‌, చౌందౌలీ, ముజాఫర్‌నగర్‌, బిజ్‌నోర్‌, ఔన్‌పూర్‌, భాగ్‌పట్‌ జిల్లాల్లో వర్షం ప్రభావం అధికంగా ఉంది. వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. పలు చోట్ల సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

ఇక మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. బాధితులకు తక్షణమే పరిహారం చెల్లించాలని సీఎం యోగి ఆదేశించారు. భారీ వర్షాలు పడడంతో గోధుమలు, ఆవాల పంటలు, బంగాళా దుంపల పంటలకు నష్టం వాటిల్లింది. ఇక ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడింది. వర్షం కారణంగా ఢిల్లీ ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.