పెళ్లికి 20 మంది.. అంత్యక్రియలకు 10మంది.. సామాన్యులకేనా..? మీకు రూల్స్ వర్తించవా..?
By తోట వంశీ కుమార్
సీఎం కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలను ఎత్తిపోతలు చేసే కార్యక్రమంలో సీఎం కేసీఆర్, చిన్నజీయర్ స్వామి, మంత్రులు, అధికారులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్, మంత్రులు వందలాది మంది మధ్య ఉండి కూడా ముఖాలకు మాస్కులు ధరించలేదని, కనీస భౌతిక దూరాన్ని పాటించలేదని విమర్శించారు.
'తెలంగాణలో స్వయంగా కేసీఆర్ కరోనా లాక్‌డౌన్ రూల్స్‌ను రూపొందించారు. పెళ్లికి 20 మంది మించకూడదని, అంత్యక్రియల్లో 10 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనరాదని తెలిపారు. మాస్కులు ధరించకపోతే రూ.1000 జరిమానా విధిస్తాం అన్నారు. నియమనిబంధనలు సామాన్యులకేనా.. కేసీఆర్ ఏమైనా చట్టానికి అతీతుడా?’ అంటూ ట్విట్ఱర్‌లో ఉత్తమ్ మండిపడ్డారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 2వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత రెండు రోజులుగా వందకు పైగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.