కేసీఆర్ తీపిక‌బురు.. గొప్ప సంచ‌ల‌న‌మే అవుతుంది మరి..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 May 2020 4:05 AM GMT
కేసీఆర్ తీపిక‌బురు.. గొప్ప సంచ‌ల‌న‌మే అవుతుంది మరి..

'నేనూ రైతునే.. ముఖ్య‌మంత్రిగా నేను ఉన్న‌న్ని రోజులు.. రైతుకు న‌ష్టం జ‌ర‌గ‌నివ్వ‌ను' సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తిసారి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ మాట‌లు చెప్తుంటారు. దీనికి కొన‌సాగింపుగా తాజాగా ఓ ప్ర‌త్యేక సంద‌ర్భంలో ఆయ‌న మ‌రిన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతులకు త్వరలోనే తీపికబురు చెబుతానని ‌ప్రకటించారు. యావత్‌ దేశమే అబ్బురపడే వార్త ఒకటి చెప్పబోతున్నానని ఆయన మరింత ఉత్కంఠ‌ను సృష్టించారు.

స‌హ‌జంగా, సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు కేసీఆర్ పెట్టింది పేరు. ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత కూడా ఆయ‌న ఇలాంటి ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. అలాంటి వ్య‌క్తిత్వం క‌లిగిన కేసీఆర్ ఇప్పుడు ఏం నిర్ణ‌యం తీసుకుంటారా? అనే ఉత్కంఠ అంద‌రిలో స‌హ‌జంగానే వ్య‌క్త‌మ‌వుతోంది. రైతులు అద్భుతాలు సృష్టించే రోజులు రాబోతున్నాయి అంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌‌, త్వ‌ర‌లో చేయ‌బోయే ప్ర‌క‌ట‌న గురించి ప‌లువురు జోరుగా అంచ‌నాలు వ్య‌క్తం చేస్తున్నారు.

వివిధ వ‌ర్గాల విశ్లేష‌ణ ప్ర‌కారం, ఇప్ప‌టికే రైతుల విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆర్థిక స‌హాయం అందించ‌డం, అకాల మ‌ర‌ణం చెందితే కుటుంబాన్ని ఆదుకోవ‌డం వంటి విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇక ఇప్పుడు కీల‌క‌మైన‌ది పంట ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయ‌డం. ప్ర‌భుత్వ‌మే వివిధ ర‌కాల పంట‌లు పండిచేలా కృషి చేసి కొనుగోలు చేసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. దీంతోపాటుగా, రైతుల‌కు ఎరువులు-విత్త‌నాలు ఉచితంగా అందించే అవ‌కాశం ఉందంటున్నారు. ముఖ్య‌మం‌త్రి కేసీఆర్ ప్ర‌వచిస్తున్న నియంత్రిత సాగులో ఇది కీల‌క‌మైన చ‌ర్య అని విశ్లేషిస్తున్నారు. దీంతో పాటుగా ఇప్ప‌టివ‌ర‌కు రైతుల కోసం క‌డుతున్న బీమాకు వారి నుంచే బీమా సొమ్ము వ‌సూలు చేస్తుండ‌గా త్వ‌ర‌లో దాన్ని ప్ర‌భుత్వ‌మే చెల్లించే అవ‌కాశం ఉందంటున్నారు.

Next Story