అమెరికాలో కూడా చైనా యాప్స్‌ పై నిషేధం..?

By సుభాష్  Published on  7 July 2020 1:35 PM IST
అమెరికాలో కూడా చైనా యాప్స్‌ పై నిషేధం..?

భారత్‌లో టిక్‌టాక్ సహా మొత్తం 59 చైనా యాప్స్‌ పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అమెరికాలో కూడా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దేశ విదేశాంగ కార్యదర్శి మైక్‌ పాంపియో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాము కూడా టిక్‌టాక్‌ సహా చైనాకు సంబంధించిన యాప్స్‌ అన్ని కూడా బ్యాన్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

టిక్‌టాక్‌ యూజర్‌ డేటాను హ్యాండిల్‌ చేస్తున్న విషయంలో జాతీయ భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉందని అమెరికా చట్ట సభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో సైతం అందుబాటులో లేని ఈ యాప్‌ సైతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆకర్షిస్తున్నాయి. రెండు సంవత్సరాలుగా ట్రేడ్‌ వార్‌, హాంకాంగ్‌లో చైనా చర్యలు, మరో వైపు కరోనా వైరస్‌ని హ్యాండిల్‌ చేయడం విషయంలో అమెరికా - చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్‌యంలో చైనా యాప్స్‌ పై నిషేధం విధించాలనే ఆలోచన చేస్తున్నట్లు పాంపియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హట్‌ టాపిక్‌గా మారాయి.

కాగా, జూన్‌ 29న చైనా యాప్‌పై భారత్‌ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 59 యాప్స్‌ ను బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా చైనా యాప్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌, వుయ్‌చాట్‌, హలో యాప్‌, వుయ్‌ సింక్‌, మై కమ్యూనిటీ, వైరస్‌ క్లీనర్‌, షేర్‌ ఇట్‌తో పాటు చైనాకు సంబంధించిన మొత్తం 59 యాప్‌లపై నిషేధం విధించింది.

కాగా, ఇటీవల భారత్‌ -చైనా సరిహద్దుల్లో సైనికుల మధ్య ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. దీంతో చైనా యాప్‌లను నిషేధించే విధంగా కేంద్రం అడుగులు వేసింది. అంతేకాదు చైనా యాప్‌లను నిషేధించాలని నెటిజన్ల నుంచి కూడా భారీ ఎత్తున డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

దేశ సమగ్రతకు ఈ యాప్స్‌ ద్వారా ముప్పు పొంచి ఉందని కేంద్రం పేర్కొంది. 130 కోట్ల మంది ప్రజల డేటా ప్రమాదంలో పడకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. చైనా యాప్‌ ద్వారా భారతీయుల డేటా చోరీ అవుతుందని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే భారతదేశం బయటున్న సర్వర్లకు ఈ యాప్స్‌ ద్వారా డేటా వెళ్తోందని, దేశ భద్రత, రక్షణ దృష్ట్యా ఈ యాప్‌లను నిషేధించినట్లు కేంద్రం వెల్లడించింది.

Next Story