ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న‌ కరోనా వైర‌స్ నిన్న తెలంగాణ‌లో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌య‌మై తెలంగాణ ప్ర‌భుత్వం, అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ విష‌య‌మై మెగాప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, అపోలో గ్రూపు వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల ట్వీట్ చేశారు.

మొదటి కరోనా కేసును సికింద్రాబాద్ అపోలోలో గుర్తించామని.. అపోలోలో స్క్రీనింగ్ ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటిస్తున్నామన్నారు. జ్వరంతో హాస్పిట‌ల్‌కు వచ్చిన రోగి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి గుర్తించామన్నారు. ఆస్పత్రిలోని మిగతా రోగులను.. అతనికి దూరంగా ఉంచామని తెలిపారు.

ప్రస్తుతం రోగి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ చేసేలా ప్రత్యేకంగా చర్యలు చేప‌ట్టామ‌ని.. బాధ్యతగల పౌరులుగా ప్రతి ఒక్కరూ.. వైరస్ లక్షణాలు ఉంటే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. నిన్న‌ సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ యువకుడికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. బాధితుడు దుబాయ్ వెళ్లిన సమయంలో ఈ వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆ యువకుడు గాంధీ ఆస్పత్రిలోని ఏడో అంతస్తులోని కరోనా వార్డులో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.