ఈ రహీంలకు రాముడి “మందిరమే” ఆకలి తీరుస్తుంది!!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Nov 2019 6:17 AM GMTఆయన మతం ఇస్లాం. కానీ ఉద్యోగం చెక్కతో చేసిన దేవ మందిరాలకు పాలిష్ చేయడం. పేరు షేక్ రంజాన్. కానీ పని మాత్రం హిందువులంత శ్రద్ధతో మందిరం నమూనాలను తయారు చేయడం. ఇళ్లలో పెట్టుకునే దేవతా మందిరాల తయారీ అతని ప్రత్యేకత. అయిదుసార్లు నమాజ్ చేస్తాడో లేదో తెలియదు కానీ రోజు రోజంతా దేవాలయాలను తయారు చేయడంలోనే గడిపేస్తాడు షేక్ రంజాన్.
పదేళ్ల వయసున్నప్పుడు ఉత్తరప్రదేశ్ లోని సహారన్ పూర్ నుంచి హైదరాబాద్ కు అన్నతో పాటు వచ్చేసిన రంజాన్ పద్ధెనిమిదేళ్లుగా ఇదే పని చేస్తున్నాడు. ఒక్క షేక్ రంజాన్ మాత్రమే కాదు. సహారన్ పూర్ కి చెందిన వందలాది మంది ముస్లిం కుర్రాళ్లకు హైదరాబాద్ లో దేవ మందిరాలను చేస్తేనే పొట్ట నిండుతుంది. రోజు గడుస్తుంది. హైదరాబాద్ లోని తాడ్ బన్ దగ్గర్లోనే 35 దుకాణాలు ఒకదానిని అతుక్కుని ఇంకొకటి ఓ ఇరుకు గల్లీలో ఉంటాయి. అందరినీ సహారన్ పూరే. అందరి పనీ ఒక్కటే. వాళ్లు చేసే దేవాలయం నమూనాలు ధనికులు, పేదలని లేకుండా అందరి దగ్గరికి వెళ్లతాయి. అనకాపల్లి అమెరికా అని లేకుండా అన్ని చోట్లకీ వెళ్తాయి. సహారన్ పూర్ లో తాతల నుంచి నేర్చుకున్న పరంపరాగత దారు శిల్ల శైలిని హైదరాబాద్ కి పరిచయం చేసింది వీరే. ఓ చిన్న “గుడి” చెక్కాలంటే వీరికి మూడు రోజులు పడుతుంది. పెద్దదైతే పది రోజుల దాకా పడుతుంది. 35 మందిరం డిజైన్లు వీరి వద్ద ఉన్నాయి. అనాయాసంగా, సునాయాసంగా చేసి ఇచ్చేయగలరు.
అయితే ఒక్కోసారి పని కన్నా పస్తులే ఎక్కువ. పని ఉన్న రోజు కూడా సంపాదించేది కేవలం ఆరొందల రూపాయలే. కానీ పూర్తి స్థాయిలో ఫినిషింగ్ అయిన దారు మందిరాల ధర రూ. 800 నుంచి రూ. 50000 దాకా పలుకుతుంది. ఆకారాన్ని, పరిమాణాన్ని, అలంకరణను, చెక్క నగిషీని పట్టి ధర నిర్ణయమౌతుంది.
ఈ రహీమ్ లకు రాముడే దిక్కు. మసీదు కన్నా “మందిరమే” ముద్దు. వీళ్లకి రహీం రాముడి రూపంలో కనిపిస్తాడు. అదేమిటో దేవుడికి ఈ ముస్లింలు చేసిన దారు మందిరాలంటే చాలా ఇష్టం....!!