హత్రాస్ ఘటన: ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా ముందు మాట్లాడితే రూ.50 లక్షలట..!
By సుభాష్ Published on 6 Oct 2020 12:46 PM ISTఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ ఘటన అట్టుడుకుతోంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారంటూ మరో ఆరుగురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరో 19 ఎఫ్‌ఆర్‌లు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని గ్రూపులు రాష్ట్రంలో తీవ్ర అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా ముందు మాట్లాడితే రూ.50 లక్షలు ఇస్తామని బాధితురాలి కుటుంబ సభ్యులను ప్రలోభపెట్టారని ఆయన ఆరోపించారు. కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని, అటువంటి వారిని క్షేమించేది లేదని ఆయన అన్నారు. అయితే కేసుకు సంబంధించి కొంతమందిపై ఇప్పటికే దేశ ద్రోహం కింద కేసు నమోదు చేశామని డీజీపీ పేర్కొన్నారు.
కాగా, హత్రాస్ అత్యాచార ఘటనకు సంబంధించి 19 మందిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనను తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఈ కేసులు నమోదు అయ్యాయి. దేశ ద్రోహం, కుట్ర కోణం, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఈ కేసులు నమోదయ్యాయి. అయితే హత్రాస్ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత యువతిపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడించిన విషయం తెలిసిందే. బాధితురాలి నుంచి సేకరించిన నమూనాల్లో వీర్యం ఆనవాళ్లేవి లేవని ఆగ్రాలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వెలువరించిన నివేదిక స్పష్టం చేసింది.
కాగా, ఈ ఘటన సెప్టెంబర్ 14న జరిగింది. తీవ్ర గాయాలతో ఉన్న 19 ఏళ్ల బాధితురాలిని అలీగఢ్‌లోని జవహార్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత ఢిల్లీలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు చేస్తున్నాయి. యూపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాయి. ఇప్పటికే నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.