అప్రమత్తతే అసలైన ఔషధం..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 25 Aug 2020 12:10 PM GMTకరోనా మనదేశంలో విజృంభించి 5 నెలల పైచిలుకవుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం మరి కొన్ని రోజుల్లో ప్రకటించబోతున్న అన్‌లాక్–4 తర్వాత కరోనాతో యుద్ధం ఏరీతిలో ఉండాలనే విషయంగా ప్రజలు తర్జనభర్జన పడుతున్నారు. సెప్టెంబర్ 1 నుంచి మెట్రోరైళ్ళు కూతబెట్టనున్నాయి. ఇతర రావాణా సౌకర్యాలు పునరుద్ధరించనున్నారు. అంతర్రాష్ట్రీయ వాహనాల సర్వీసులకూ పచ్చజెండా ఊపాలనుకుంటున్నారు. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు మాత్రం ప్రస్తుతం తెరుచుకోవని తెలుస్తోంది.
గత మార్చి నెలనుంచి మనదేశంలో కరోనా విజృంభణ షురూ అయ్యింది. మొదట్లో చిన్నగా ఉన్నా రాన్రానూ దాని ఉధృతి అంతా ఇంతా కాదు. ఈ వైరస్ ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలీక పోవడంతోపాటు వ్యాక్సిన్ గానీ, నయం చేసే మందులు గానీ లేకపోవడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురయ్యారు. ఒకానొక దశలో కరోనా వస్తే ఇక అంతే సంగతులు అన్నట్టుండేది.
అందుకే ఎవరికి కరోనా వచ్చినా, చివరికి కరోనాతో మరణించినా ఆఖరు చూపునకు రావడానికి కూడా ప్రజలు విపరీతంగా భయపడ్డారు. ఈ అయిదునెలలూ జనజీవనం స్తంభించింది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఈ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే అన్‌లాక్–4లో చాలా రంగాలను యథావిధిగా పనిచేసకునేందుకు అనుమతులివ్వబోతోంది.
కరోనా పేద, మధ్య తరగతి ప్రజలకు పెను సవాలుగా పరిణమిస్తోంది. ఉపాధి కోసం పట్టణాల బాట పట్టిన వలస కూలీలు అదే ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో సొంతూళ్ళకు వెళ్ళిపోయారు. చిన్నచిన్న ఉద్యోగస్తులు కూడా పట్టణాల్లో ఇళ్ళకు అద్దెలు కట్టుకోలేక తమ ఊళ్ళకు వెళ్ళారు. అనూహ్యంగా పట్టణ, నగరాల్లో వలసజీవుల సంఖ్య తగ్గిపోవడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. స్కూళ్ళు, కాలేజీలు మూతపడటంతో చదువులు మూలనపడ్డాయి. దేశం అంధకారంలో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ను దశల వారీగా కేంద్రం సడలిస్తూ వచ్చింది.
అన్‌లాక్–4 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కరోనాను ఇక మీద అన్ని వ్యాధుల్లా చూడాల్సిందే అని తేల్చి చెప్పింది. ఈ వ్యాధి కోసం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీయడానికి కేంద్రం సిద్ధంగా లేదు. అందుకే ప్రజలకు కరోనా బాధ్యతను అప్పగించేసింది. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాల్సిందే! ఇక ప్రభుత్వం నుంచి కఠిన నిబంధనలు ఉండవు. కరోనా నిర్ధారణైతే మాత్రం చికిత్స ప్రభుత్వ పరంగా ఉచితంగానే ఉంటుందని తెలుస్తోంది.
అన్‌లాక్ సంగతి అటుంచితే కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతునే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు పరిస్థితి ఏంటని చెప్పాల్సి వస్తే ఇంకా వైరస్ అదుపులోకి రాలేదనే చెప్పాలి. అయితే ఈనెల మొదటి కన్నా తగ్గుముఖం అనుకోవచ్చు. రికవరీ రేటు బాగానే ఉన్నా, మరణాల శాతం ఇంకా తగ్గాల్సి ఉంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కత, చెన్నైలలో నయమనే చెప్పాలి. హైదరాబాద్‌లో కొంత తగ్గినా.. పట్టణాల్లో, చిన్న చిన్న పల్లెల్లో విజృంభిస్తున్నట్లు కనిపిస్తోంది. మనం అప్రమత్తం కావడానికి ఇదే సరైన సమయం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
దేశం నుంచి దేశానికే కాదు.. కాలం నుంచి కాలానికి కూడా కరోనా రూపు మారుతోందని వైద్యులంటున్నారు. ఈ బయాలాజికల్ వైరస్ తీవ్రత మొదటికీ ఇప్పటికీ కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. అయితే వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే తగు జాగ్రత్తతో డాక్టర్లను సంప్రదించాలి. మొదట్లో ఇది మనుషుల ఊపరితిత్తులపై దాడి చేస్తుందని.. ఊపిరాడకే చాలా మంది నరకయాతన అనుభవిస్తారని చెబుతూ వచ్చారు. తర్వతర్వాత దీనికి రక్త నాణాల్లో రక్తాన్ని గడ్డకట్టించే గుణం కూడా ఉందని తేలింది. దానికి విరుగుడుగా మందులు ఇస్తున్నారిప్పుడు. సాధారణంగా వైరస్ ఒకసారి విరుచుకు పడ్డాక తగ్గక తప్పదు. ఇన్ఫెక్షన్ సోకిన వారి సంఖ్య పెరిగినా దాని ఉధృతి మాత్రం కచ్చితంగా తగ్గుతుందని డాక్టర్ల అంచనా.
కరోనా వచ్చిందనగానే స్టిరాయిడ్‌లు ఇవ్వడం కూడా సరికాదని వైద్య నిపుణులంటున్నారు. సాధారణంగా ప్రతి మనిషిలోనూ సహజసిద్ధమైన ఇమ్యూనిటీ ఉంటుంది. ఈ ఇమ్యూనిటీలో మొదటి రకం వైరస్‌ను నియంత్రిస్తే రెండోది వైరస్ ఎక్కడున్నా పట్టుకోడానికి రసాయనలు విడుదల చేస్తుంటాయి. ఆ సమయంలోనే సైటోకైన్స్ శరీరానికి హాని కలిగిస్తుంటాయి. ఆ సమయాల్లోనే ఈ స్టిరాయిడ్ల వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ చిన్నపాటి లక్షణాలు కనిపించిన వెంటనే స్టిరాయిడ్లను ప్రయోగించడం మానుకోవాలి. అలా ఇస్తే ఒక్కోసారి ఇమ్యూనిటీ శక్తి కూడా స్పందించకపోయే ప్రమాదముందని వైద్యులంటున్నారు.
పాశ్చాత్య దేశాలతో పోలిస్తే దక్షిణాసియా దేశాల్లో వైరస్ ప్రభావం కాస్త తక్కువే. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో పోల్చితే మన దేశంలో ప్రతి లక్షమందికి చనిపోయే వారి సంఖ్య ఎక్కువ. దీన్ని బట్టే వైరస్ తరచూ తన రూపాన్ని తీవ్రతనూ మార్చుకుంటుందని చెబుతున్నారు. వైరస్ వచ్చిన కొత్తలో కేసలు పెరిగినపుడు ఆస్పత్రుల సంఖ్య సరిపోవని, వెంటిలేటర్లు సరిపడా లేవని ఆందోళన చెందిన మాట వాస్తవమే అయినా.. ఆ తర్వాత అంత ఇంటెన్సివ్ కేర్ లేకుండానే తగ్గుతున్నట్లు తేలింది. చాలా మందికి ఫ్లో ఆక్సిజన్ సాయంతోనే నయం చేయగలుగుతున్నారు. అదే కాదు దశలవారీగా చికిత్స అందించే విషయంలోనూ డాక్టర్లకు ప్రస్తుతం ఓ స్పష్టత వచ్చేసింది. ప్రాణాపాయం నుంచి తప్పించడానికి డెక్సోమెథాసోన్, చికిత్స వ్యవధి తగ్గించడానికి రెమిడిసివిర్ టాబ్లెట్లను వాడుతున్నారు.
కాబట్టి అన్‌లాక్–4 సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎన్ని సడలింపులిచ్చినా.. ప్రజలు జాగ్రత్తగా ఉండటం అత్యవసరం. వచ్చే మే దాకా అప్రమత్తంగానే వ్యవహరించాలి. గదుల్లో గాలి వెలుతురు సరిగా వచ్చేలా చూసుకోవాలి. ఎందుకంటే మూసి ఉన్న గదుల్లో వైరస్ ఎక్కువ కాలముండే ప్రమాదముంది. వైరస్ తీవ్రత తగ్గాలంటే దాన్ని ఆపగలగాలి. అది ఒకరి నుంచి మరొకరిలోకి ప్రవేశిస్తున్నంత కాలం విజృంభిస్తూనే ఉంటుంది. ఇది ఎవరు ఔనన్నా.. కాదన్నా విస్మరించలేని సత్యం!!