7 నుంచి మెట్రో పరుగులు.. అన్‌లాక్ ‌4.0 మార్గదర్శకాలు విడుదల

By సుభాష్  Published on  30 Aug 2020 4:55 AM GMT
7 నుంచి మెట్రో పరుగులు.. అన్‌లాక్ ‌4.0 మార్గదర్శకాలు విడుదల

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో అన్‌లాక్‌ 3.0 రేపటితో ముగియనుంది. ఇక సెప్టెంబర్‌ 1 నుంచి అన్‌లాక్‌ 4.0 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్‌లాక్‌ 4.0కు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి మెట్రో రైళ్లు నడిపించుకునేందుకు అనుమతి ఇచ్చింది. పట్టణ అభివృద్ధి, రైల్వేశాఖలు కేంద్ర హోంశాఖతో సంప్రదించి దశల వారీగా మెట్రో సేవలు ప్రారంభించుకోవాలని సూచించింది.

అలాగే 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లు ప్రారంభించుకోవచ్చని కేంద్రం తెలిపింది. అదే విధంగా రాజకీయ సభలు, సమావేశాలు, వినోదం, మతపరమైన సమావేశలు నిర్వహించుకోవాలంటే వంద మందికి మించకూడదని కేంద్రం తెలిపింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో సెప్టెంబర్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా అన్ని రకాల విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు మూసివేసే ఉంచాలని తెలిపింది. ఈ నేపథ్యంలో అన్‌లాక్‌ 4.0కు సంబంధించిన మార్గదర్శకాలు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌బల్లా ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

21 నుంచి అనుమతించేవి..

పాఠశాలలు మూసి ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌ బోధన, టెలి కౌన్సిలింగ్‌, ఇతర కార్యకలాపాల కోసం 50శాతం బోధన, బోధనేతర సిబ్బందిని రాష్ట్రాలు ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే నిబంధనలు మాత్రం తప్పనిసరిగ్గా పాటించాలి. విద్యార్థుల కోసమే 21 నుంచి ఉన్నత విద్యాసంస్థలు తెరుస్తారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే కరోనా పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు గమనించిన తర్వాత ఉన్నత విద్యాశాఖ ఇందుకు అనుమతి ఇస్తారు.

అలాగే సెప్టెంబర్‌ 20 వరకు వివాహ కార్యక్రమాల్లో సుమారు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే పాల్గొనాలనే నిబంధన ఉంది. ఇక సెప్టెంబర్‌ 21 నుంచి వీటిలో 100 మంది వరకు పాల్గొనవచ్చని తెలిపింది.

కంటైన్‌మెంట్‌ జోన్లలో 30 వరకు లాక్‌డౌన్‌

అన్ని కంటైన్‌మెంట్‌ జోన్లలో సెప్టెంబర్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కఠినంగా ఉంటుందని కేంద్ర హోంశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లో సూచించింది. జిల్లాల్లోని కంటైన్మెంట్‌ జోన్లు, వాటి పరిధులను రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్లలో పొందుపర్చడంతో పాటు వాటి వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు పంపాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమత లేకుండా కంటైన్‌మెంట్‌ జోన్ల బయట ఎలాంటి లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించకూడదు.

రవాణాపై ..

రాష్ట్రాల లోపల, వేర్వేరు రాష్ట్రాల మధ్య రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని తెలిపింది. ప్రయాణిలు, సరుకుల రవాణాపై ఎలాంటి పరిమితులు అమలు చేయకూడదు. అలాగే భౌతిక దూరం కోసం కొవిడ్‌ -19 జాతీయ నిర్దేశాలను దేశం మొత్తం పాటించాల్సిందే. దుకాణాల్లో వినియోగదారుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టాలి. 65 ఏళ్లపైబడిన వారు, ఆరోగ్య సమస్యలున్నవారు, గర్బిణులు, పదేళ్లలోపు పిల్లలు ఇళ్లల్లోనే ఉండటం మంచిది. భౌతిక దూరం అమలు చేయడానికి 144 సెక్షన్‌ విధించుకోవచ్చు.

వీటిపై నిషేధం

సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, పార్కులు, అలాగే అంతర్జాతీయ విమాన ప్రయాణాలు (కేంద్రం అనుమతి ఇచ్చివి మాత్రమే), కంటైన్‌మెంట్‌ జోన్ల బయట పైన పేర్కొన్న కార్యకలాపాలు మినహా మిగిలినవన్నీ కొనసాగింపు.

తెలంగాణ మెట్రోపై త్వరలో నిర్ణయం

కాగా, సెప్టెంబర్‌ 7 నుంచి దశల వారీగా మెట్రో ప్రయాణాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన కేంద్రం.. ఇక హైదరాబాద్‌ మెట్రో రైళ్లు ఎప్పటి నుంచి నడుస్తాయనే విషయమై అందరిలో తలెత్తుతున్న ప్రశ్న. హైదరాబాద్‌లో మెట్రో సేవలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి అనే విషయం ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Next Story
Share it