మహేష్ బాబు గురించి మీరు తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Aug 2020 8:33 AM ISTఆగష్టు 9, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు పండగ రోజు..! హాలీవుడ్ స్థాయి కటౌట్ ఉన్న హీరో మహేష్ బాబు అని ఇప్పటికే రుజువైపోయింది. మహేష్ బాబు వయసు 45 సంవత్సరాలు అంటే చాలా మంది అసలు నమ్మలేరు. ఫిజిక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మహేష్ బాబు లైఫ్-కెరీర్ కు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అందులో కొన్ని..
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగష్టు 9, 1975న జన్మించాడు. మహేష్ బాబు 21 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడని ఎంతో మంది చెబుతూ ఉంటారు. అప్పటికీ.. ఇప్పటికీ మహేష్ బాబు ఫోటోలను చూస్తే అలాగే అనిపిస్తూ ఉంటుంది.
మహేష్ బాబు చిన్నప్పటి నుండే సినిమాలంటే ఎంతో ఇష్టాన్ని చూపించేవాడు. తన తండ్రి కృష్ణతో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. తొమ్మిది సినిమాల్లో మహేష్ బాబు చిన్నప్పుడే అలరించాడు. కొడుకు దిద్దిన కాపురం, పోరాటం, నీడ, బజారు రౌడీ, శంఖారావం, ముగ్గురు కొడుకులు, గూడాచారి 117, బాల చంద్రుడు, అన్న తమ్ముడు సినిమాల్లో మహేష్ బాబు నటించాడు.
1990 నుండి కొద్ది సంవత్సరాల పాటూ సినిమాలకు బ్రేక్ తీసుకుని చదువుపై దృష్టి పెట్టాడు మహేష్ బాబు. ఇక హీరోగా 1999 లో 'రాజకుమారుడు' సినిమాతో దూసుకొచ్చాడు మహేష్.
తమిళ్ యాక్టర్ సూర్య తమ్ముడు కార్తీ మహేష్ బాబు స్కూల్ మేట్. చెన్నై లోని సెయింట్ బేడే ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకెండరీ స్కూల్ లో చదివాడు మహేష్.
ఒక్కడు సినిమా మహేష్ బాబు కెరీర్ లో భారీ హిట్ గా నిలిచినప్పటికీ.. స్టార్ ను చేసింది మాత్రం 'పోకిరి' సినిమా అనే చెప్పొచ్చు. ఇండస్ట్రీ హిట్ గా సినిమా నిలిచింది.. అంతేకాదు ట్రెండ్ సెట్టర్ కూడా..! ఈ సినిమాను తమిళం, హిందీలో కూడా రీమేక్ చేశారు. సల్మాన్ ఖాన్ కెరీర్ ను నిలబెట్టింది ఈ సినిమా రీమేక్ 'వాంటెడ్' అనే అంటారు.
మహేష్ బాబు సినిమాలు కలెక్షన్ల పరంగా దూసుకుంటూ వెళ్ళేవి.. ఒక్కో సినిమా అంతకు ముందు సినిమాకు మించిన వసూళ్లు చేయడం మొదలయ్యాయి. ఓవర్సీస్ లో కూడా మహేష్ బాబు సినిమాకు భారీ వసూళ్లు దక్కాయి.
ఇక ఛారిటీ విషయంలో కూడా మహేష్ బాబు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు. చాలా వరకూ గోప్యంగానే ఉంచాడు మహేష్. తాను సంపాదిస్తున్న డబ్బుల్లో 30 శాతం ఛారిటీలకే కేటాయిస్తూ రియల్ లైఫ్ లోనూ శ్రీమంతుడేనని నిరోపించుకున్నాడు. బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి కూడా తెలిసిందే..! ఆంధ్రప్రదేశ్ లో బుర్రిపాలెం అనే గ్రామాన్ని, తెలంగాణలో సిద్ధాపురాన్ని దత్తత తీసుకున్నాడు మహేష్ బాబు. బుర్రిపాలెం మహేష్ బాబు తండ్రి కృష్ణ సొంతఊరు అన్నది తెలిసిన విషయమే..! 1000 మందికి పైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించాడు మహేష్ బాబు. వ్యాక్సినేషన్లు, హెల్త్ క్యాంపులు పలు చోట్ల ఏర్పాటు చేయించాడు మహేష్ బాబు.
మహేష్ బాబు నటి, మోడల్ అయిన నమ్రత శిరోద్కర్ ను నాలుగేళ్ల పాటూ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. గౌతమ్, సితారలతో కలిసి లాక్ డౌన్ సమయంలో మహేష్ బాబు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. మహేష్ బాబు పలు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు నిర్మాతగా మారి తన సినిమాల నిర్మాణంలోనే కాకుండా.. కొత్త తరహా ట్యాలెంట్ ను కూడా టాలీవుడ్ కు పరిచయం చేయాలని అనుకుంటూ ఉన్నాడు.