కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత
By సుభాష్ Published on 9 Oct 2020 12:57 PM ISTకేంద్ర మంత్రి, ప్రముఖ దళిత నేత రామ్ విలాస్ పాశ్వాన్ (74) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన గుండె శాస్త్ర చికిత్స జరిగింది. పాశ్వాన్ మరణ వార్తను ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు.
దేశంలోని అత్యంత ప్రసిద్ద దళిత నాయకులలో ఒకరైన పాశ్వాన్ గుండె సంబంధిత ఇబ్బందులతో చాలా కాలంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం కొన్ని ఆకస్మిక పరిణామాల కారణంగా అర్ధరాత్రి సమయంలో గుండెకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.
రాంవిలాస్ పాశ్వాన్ లోక్‌జన్‌శక్తి పార్టీకి అధ్యక్షుడిగా సుమారు ఐదు దశాబ్దాలుగా భారత రాజకీయ చరిత్రలో కీలక నేతగా ఎదిగారు. ఎనిమిది సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాంవిలాస్ కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీశాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యవ్వనంలో పాశ్వాన్ ఒక ఫైర్‌బ్రాండ్ సోషలిస్టు, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో ముందున్నారని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. అలాగే పాశ్వాన్ మరణం తనను మాటలకందని బాధకు గురి చేసిందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్ సమావేశాల్లో ఆయన లోతైన సూచనలు ఇచ్చేవారని, రాజకీయ జ్ఞానం, దార్శనికత, పాలనాదక్షతల్లో ఆయనకు సాటిలేరని మోదీ ట్వీట్ చేశారు. నేడు ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.
కాగా, 1946 జూలై 5న బీహార్‌లోని ఖగారియాలో పాశ్వాన్ జన్మించారు. పీజీ, న్యాయ విద్య అభ్యసించారు. విద్యాభ్యాసం అనంతరం డీఎస్పీగా పోలీసు ఉద్యోగం వచ్చినా రాజకీయాలపై ఆసక్తితో ఆ ఉద్యోగం చేరలేదు. 1969లో సంయుక్త సోషలిస్టు పార్టీ టికెట్‌పై తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. బీహార్‌లోని హాజీపూర్ లోక్ సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 8 సార్లు గెలిచారు. పాశ్వాన్ 1975నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జైలుకెళ్లారు. 2000 సంవత్సరంలో ఆయన మరికొందరు నాయకులతో కలిసి లోక్‌జనశక్తి పార్టీని స్థాపించారు. పేదలు, అణగారిన వర్గాల సమస్యలపై అవకాశం లభించిన ప్రతిసారీ గళమెత్తే నేతగా పేరుంది.
గత ఎన్నికల్లో సమస్తీపుర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన పాశ్వాన్ సోదరుడు రామచంద్ర పాశ్వాన్ 2019 జులై 21న అనారోగ్యంతో కన్నుమూశారు. 17వ లోక్‌సభ కాలావ్యధివలోనే అన్నదమ్ములిద్దరూ మరణించారు. 8 పర్యాయాలు లోక్‌సభ సభ్యుడిగా గెలిచి, ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనంతటి సుదీర్గ రాజకీయ ప్రస్థానం ఎవ్వరికీ లేదు. 1974లో లోక్‌దళ్ ఏర్పాటైనప్పుడు అందులో చేరి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అత్యవసర పరిస్థితుల అనంతరం 1977లో జనతా పార్టీలో చేరి బీహార్‌లోని హాజీపుర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి 1980, 89, 96, 98, 99, 2004, 2014 ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు. 2009లో మాత్రం ఓటమిపాలయ్యారు. ఇక 2010లో రాజ్యసభకు ఎన్నికై 2014 వరకు కొనసాగారు. 2019లో సీట్ల సర్దుబాటులో భాగంగా లోక్‌సభకు పోటీ చేసే అవకాశం రాకపోవడంతో రాజ్యసభకు మరోసారి ఎన్నికయ్యారు.