ఆ మహిళ వస్తే మరిన్ని అక్రమాలు బట్టబయలు..!

By సుభాష్  Published on  9 Oct 2020 6:47 AM GMT
ఆ మహిళ వస్తే మరిన్ని అక్రమాలు బట్టబయలు..!

అక్రమాస్తుల కేసులు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి వ్యవహారంలో విచారణ ముమ్మరంగా చేశారు ఏసీబీ అధికారులు. నరసింహారెడ్డి నాలుగు రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. ఏది అడిగిన నోరు విప్పని నర్సింహారెడ్డిని మరింత లోతుగా విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. సోదాల్లో పట్టుబడిన, ఇతర దర్యాప్తుల్లో సేకరించిన పత్రాలు, ఆధారాలను ముందుంచి ఏసీపీని ప్రశ్నించినా ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. రూటు మార్చిన ఏసీబీ అధికారులు మరో కోణంలో కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పట్టుబడిన ఆస్తుల్లో నర్సింహారెడ్డి బినామీలుగా గుర్తించిన వారి గురించి ఆరా తీస్తున్నారు.

మాదాపూర్‌ భూకొనుగోలులో నర్సింహారెడ్డి బినామీలు 8 మంది ఉన్నట్లు, అలాగే మాదాపూర్‌కు చెందిన ఓ మహిళతో ఏసీపీకి సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించారు. ఆమె పేరిట కూడా శంకర్‌పల్లితోపాటు పలు ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సదరు మహిళ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో తెలుసుకున్నారు. ఆమె స్వదేశానికి వస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మాదాపూర్‌లో ఇప్పటికే గుర్తించిన రూ.50 కోట్ల విలువైన స్థలంతోపాటు ఖరీదైన ఇంటిని నర్సింహారెడ్డి కొనుగోలు చేసినట్లు అధికరాఉలు పత్రాలు సేకరించారు. వీటి ఆధారంగానే మాదాపూర్‌ మహిళ పేరిటే ఈ ఆస్తి ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో నర్సింహారెడ్డిని న్యాయస్థానంలో హాజరు పర్చి తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇలా ఏసీపీ విషయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తవ్వే కొద్ది నిజాలు బయటకు వస్తున్నాయి. నర్సింహారెడ్డి భాగోతం చూసి ఏసీబీ అధికారులు సైతం ఆశ్యర్యపోతున్నారు.

Next Story