తవ్వేకొద్ది బయటపడుతున్న ఏసీపీ నర్సింహారెడ్డి అక్రమాలు

By సుభాష్  Published on  3 Oct 2020 6:45 AM GMT
తవ్వేకొద్ది బయటపడుతున్న ఏసీపీ నర్సింహారెడ్డి అక్రమాలు

అక్రమాస్తుల వ్యవహారంలో ఏసీబీకి చిక్కన మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డికి సంబంధించి మరో వ్యవహారం వెలుగు చూసింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ సైబర్‌ టవర్స్‌ సమీపంలో సుమారు రూ.50 కోట్ల విలువ చేసే 1960 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని నొక్కేసేందుకు కొందరితో కలిసి ప్లాన్‌ వేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధం ఉన్న 8 మందిని శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చింది ఏసీబీ. సైబర్‌ టవర్స్‌ ప్రాంతంలో ఉన్న ఈ స్థలాన్ని ప్రభుత్వం గతంలోనే ఏపీఐఐసీ, హుడాకు కేటాయించింది. ఈ భూములను రిజిస్ట్రేషన్‌ చట్టం, 1908లోని 22ఏ(1)(ఏ) సెక్షన్‌ కింద నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ విలువైన భూములపై కన్నేసిన నర్సింహారెడ్డి మరికొందరితో కలిసి ఈ ప్లాన్‌ వేసినట్లు గుర్తించారు.

కాగా ఆ భూమపై కన్నేసిన నర్సింహారెడ్డి 1960 చదరపు గజాల స్థలాన్ని నాలుగు ప్లాట్లుగా విభజించి సజ్జన్‌గౌడ్‌, తిరుపతిరెడ్డి, చంద్రశేఖర్‌, జైపాల్‌ పేర్లతో 2016లో నకిలీ పత్రాలు సృష్టించారు. వారి నుంచి గజానికి రూ.20వేల చొప్పున చెల్లించి, 2018లో కొనుగోలు చేసినట్లు పత్రాలను సృష్టించినట్లు తేలింది. అయితే ప్రభుత్వ విలువ ప్రకారం ఆ భూమి రూ.6 కోటలు కాగా, మార్కెట్‌ ధర రూ.50 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

అంతేకాకుండా నర్సింహారెడ్డి ఇక్కడ ఓ కమర్షియల్‌ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు గుర్తించారు. అంత అనుకున్నట్లు జరిగితే ఇక్కడ భవన నిర్మాణం ప్రారంభమయ్యేది. కానీ అంతలోనే ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు నర్సింహారెడ్డి. ఇంకా ఎలాంటి భూ దందాలకు పాల్పడ్డాడో ఏసీబీ లోతుగా విచారిస్తోంది.

అయితే సర్వే నంబర్ ప్రకారం కాకుండా మున్సిపల్‌ నంబర్‌తో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు తేల్చారు. నర్సింహారెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో భాగస్వాములైన 8 మందిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయగా, వీరిలో సజ్జన్‌గౌడ్‌, తిరుపతిరెడ్డి, చంద్రశేఖర్‌, జైపాల్‌, మధుకర్‌ శ్రీరాం,బత్తిని రమేష్‌, శ్రీనివాస్‌, బండి చంద్రారెడ్డి ఉన్నారు.

Next Story