సొంత దళకమాండర్‌నే హతమార్చిన మావోయిస్టులు

By సుభాష్  Published on  3 Oct 2020 5:38 AM GMT
సొంత దళకమాండర్‌నే హతమార్చిన మావోయిస్టులు

సొంత దళకమాండర్‌నే మావోయిస్టులు హతమార్చిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని బస్తర్‌ రేంజ్‌ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ సుందర్‌రాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బీజాపూర్‌ జిల్లా గంగులూరు ఏరియాలో పలువురు ఆదివాసీలను మావోయిస్టులు హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యల నేపథ్యంలో పలువురు అమాయక ఆదివాసీలు సైతం బలయ్యారు. ఈ క్రమంలో గంగులూరు డీవీసీ ఏరియా కమిటీ కమాండర్‌ విజా మొడియం అలియాస్‌ భద్రు (39) కొంతకాలంగా వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ వారిని హత్య చేశారని సమాచారం మావోయిస్టు పార్టీ కీలక నేతలకు చేరింది. దీంతో మావోయిస్టులు ముఖ్యనేతలు గురువారం గంగులూరు-కిరండోల్‌ మధ్యలోని ఎటావర్‌ అటవీ ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించి సదరు దళకమాండర్‌ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. భద్రును హతమార్చిన తర్వాత ఆయన మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలుస్తోంది. సదరు దళకమాండర్‌ బీజాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మాంకెల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. అతనిపై రూ.8 లక్షల రివార్డు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో 18 కేసులు నమోదై ఉన్నట్లు సుందర్‌రాజ్ వివరించారు.

కాగా, ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మావోయిస్టులు అలజడులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. బస్తర్‌ డివిజన్‌లో మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనులను హతమారుస్తున్నారు. తాజాగా గురువారం కూడా ఇద్దరిని హతమార్చారు. అలాగే కుర్చేలి గ్రామానికి చెందిన 16 మంది వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హతమార్చారు. మరి కొంతమంది గ్రామస్తులను కూడా నాలుగు రోజుల కిందట మావోలు హత్య చేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో బస్తర్‌ అడవుల్లోని గిరిజనులు భయంతో వణికిపోతున్నారు. మావోయిస్టుల అలజడిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఘటనే సెప్టెంబర్‌ 5న బీజాపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. బీజాపూర్‌ జిల్లాలోని మోటాపోల్‌, పునాసార్‌ గ్రామాలకు చెందిన 25 మంది గిరిజనులను కిడ్నాప్‌ చేసిన మావోయిస్టులు.. వారిలో నలుగురిని దారుణంగా హతమార్చారు. దట్టమైన అడవుల్లోనే ప్రజాకోర్టు నిర్వహించి శిక్షలు విధించారు. కిడ్నాప్‌ చేసిన వారిలో మిగిలిన 16 మంది ఉండగా, వారిని కూడా హతమార్చారు. ఇలా ఒకే నెలలో మొత్తం 20 మందిని మావోయిస్టులు హత్య చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అలాగే వరుస ఎన్‌కౌంటర్‌లతో సరిహద్దు పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సొంత దళకమాండర్‌నే హతమార్చడం సంచలనం రేపుతోంది. విషయం తెలుసుకున్న పోలీసు బలగాలు బస్తర్‌ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story