సరిహద్దుల్లో మావోల బీభత్సం.. ఒకే గ్రామంలో 16 మందిని హత్య

By సుభాష్  Published on  1 Oct 2020 7:42 AM GMT
సరిహద్దుల్లో మావోల బీభత్సం.. ఒకే గ్రామంలో 16 మందిని హత్య

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మావోయిస్టులు మరోసారి అలజడి రేపారు. బస్తర్‌ డివిజన్‌లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనులను హతమారుస్తున్నారు. తాజాగా కుర్చేలి గ్రామానికి చెందిన 16 మంది వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హతమార్చారు. మరి కొంతమంది గ్రామస్తులను కూడా నాలుగు రోజుల కిందట మావోలు హత్య చేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో బస్తర్‌ అడవుల్లోని గిరిజనులు భయంతో వణికిపోతున్నారు. మావోయిస్టుల అలజడిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఘటనే సెప్టెంబర్‌ 5న బీజాపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. బీజాపూర్‌ జిల్లాలోని మోటాపోల్‌, పునాసార్‌ గ్రామాలకు చెందిన 25 మంది గిరిజనులను కిడ్నాప్‌ చేసిన మావోయిస్టులు.. వారిలో నలుగురిని దారుణంగా హతమార్చారు. దట్టమైన అడవుల్లోనే ప్రజాకోర్టు నిర్వహించి శిక్షలు విధించారు. కిడ్నాప్‌ చేసిన వారిలో మిగిలిన 16 మంది ఉండగా, వారిని కూడా హతమార్చారు. ఇలా ఒకే నెలలో మొత్తం 20 మందిని మావోయిస్టులు హత్య చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకోసి హత్య

ఇన్‌ఫార్మర్ల నెపంతో ఆదివాసీలపై మావోయిలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. దట్టమైన ఆడవుల్లో ప్రజాకోర్టులు నిర్వహించి నలుగురిని ఉద్యమ ద్రోహులుగా నిర్ధారిస్తూ, కాళ్లు , చేతులు కట్టేసి గొంతు కోసి హతమార్చడంపై ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. తమ కదలికలపై పోలీసులకు సమాచారం ఇచ్చే వారికి ఇదే గతిపడుతుందని మావోలు హెచ్చరించినట్లు తెలుస్తోంది.

అలాగే మరో ఐదుగురిని తీవ్రంగా గాయపర్చి వదిలిపెట్టారు. వారు గ్రామాలకు చేరుకుని జరిగిన విషయాన్ని చెప్పడంతో మావోయిస్టుల ఘాతుకం వెలుగులోకి వచ్చింది. మరో ఐదుగురిని తీవ్రంగా కొట్టి వదిలిపెట్టారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సహకరిస్తున్నారని, పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా పని చేస్తున్నారనే నెపంతో మావోయిస్టులు ఈ ఘటనలకు పాల్పడుతున్నారు. మావోల బీభత్సంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు గజగజ వణికిపోతున్నారు.

వణుకు పుట్టిస్తున్నవరుస ఎన్‌కౌంటర్లు

ఇక తెలంగాణలోని ఏజన్సీ ప్రాంతాల్లో వరుస ఎన్‌కౌంటర్లు వణుకు పుట్టిస్తున్నాయి. సెప్టెంబర్‌ 23న భద్రాది కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా ముగ్గురు మృతి చెందారు.

కొమ్రంభీమ్‌ జిల్లాల్లో కాల్పుల మోత

అలాగే సెప్టెంబర్‌ 19న కొమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కాల్పుల మోత మోగింది. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లోని కడంబ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. అంతకు ముందు కూడా భద్రాది కొత్తగూడెం జిల్లాలో వరుస ఎన్‌కౌంటర్లు జరగడంతో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్‌ నిర్వహిన్నారు. మావోల కదలికలపై ఎప్పకప్పుడు పోలీసులు నిఘా పెంచారు. గత కొన్నేళ్లుగా తెలంగాణలో మావోల కార్యకలాపాలు సద్దుమణిగిపోయాయి. ఇటీవల నుంచి మళ్లీ కదలికలు ఎక్కువై పోవడంతో ఏజన్సీ ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

Next Story